కేబుల్ టీవీ రంగంలో తనదైన ముద్ర వేసి... కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి చెలికాని రాజశేఖర్ అని పలువురు కొనియాడారు. హాత్వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్, దివంగత చెలికాని రాజశేఖర్ సంస్మరణ సభ శనివారం విశాఖలోని శివాజీపాలెం తాండ్ర పాపారాయ కల్చరల్ హాల్లో జరిగింది. 'వీ టెలీ' అధినేత, రాజశేఖర్ సోదరుడు చెలికాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి రాజశేఖర్ చూపిన చొరవ మరువలేనిదని పలువురు వక్తలు అన్నారు. ఆయనను కోల్పోవడం కేబుల్ టీవీ రంగానికి తీరని లోటు అన్నారు. సిటీ కేబుల్ మాజీ అధినేత దేవినేని శేషగిరిరావు, స్కోవా ప్రతినిధులు నింగిబోతు జనార్థన్ రావు, మూర్తి పోతనరెడ్డి, వాజీ శ్రీనివాసరావు, సిటీ కేబుల్ ఎండీ శాండిల్య, సిగ్నల్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.