విశాఖ ఉక్కు పరిశ్రమపై తెరాస నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి నడపాలని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం సహజమైన ప్రక్రియ అని.. ఇది కొత్త అంశం కాబోదని చెప్పారు. ఆంధ్రులను తమ ప్రాంతం నుంచి తరిమికొడతామన్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విజయవాడలో అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రేమ ఉంటే గనుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం లేదా..? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల క్రితం ఉక్కు పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతుల కోసం రాజకీయ పార్టీలు ఎందుకు ఇప్పటివరకు పోరాటం చేయడం లేదని నిలదీశారు. రాజకీయ స్వలాభం కోసం విశాఖ ఉక్కు పోరాటం చేస్తున్నారని... కేంద్ర ప్రభుత్వం నష్టాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడకుండా కార్మికులకు.. ఆ ప్రాంత ప్రజలకు నష్టం లేకుండా అభివృద్ధి చేసేలా ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని తెలిపారు.
ప్రజల మనోభావాలతో తమ ప్రభుత్వం ఆడుకోబోదని స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అలాగే కొనసాగించి మూతపడడానికి కారణం కాకుండా.. అక్కడి ఉద్యోగులకు భరోసాగా నిలుస్తూ ఆర్ధికంగా ముందుకు సాగడానికి ఉపయోగపడాలనే కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. ప్రధాని మోదీ పేదరికంలో పుట్టిన వ్యక్తి అని.. పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి