పర్యటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. దీనితో పాటు ఉత్తమ రైల్వేస్టేషన్‌గా విశాఖకు, ఉత్తమ కాఫీ టేబుల్ బుక్ కేటగిరీలోనూ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఏపీ తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ అవార్డులను అందుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు రావటం సంతోషకరంగా ఉందని అన్నారు. ఏపీలో ఆధ్యాత్మిక పర్యటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆధ్యాత్మిక పర్యటనలకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే పర్యటక సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. మౌలికవసతులు, రవాణా, పర్యటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. విదేశీ పర్యటకుల కోసం విశాఖలో వీసా ఆన్ అరైవల్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని బీచ్‌లను ఉన్నత ప్రమాణాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఇదీ చదవండి