చకచకా కత్తి తిప్పుతున్న ఈమె పేరు వెన్నెల నీలకంఠ. సొంతూరు కర్ణాటకలోని మంగళూరు పక్కన చిన్నగ్రామం. విశాఖలో జరిగిన జాతీయస్థాయి కర్రసాము, కత్తిసాము, శిలంబం పోటీల్లో.. కర్రసాము, కత్తిసాము, డబుల్ కర్రసాములో పతకాలు కైవసం చేసుకుంది. చిన్నప్పటి నుంచీ మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువతో సాధన చేశానంటోంది వెన్నెల.
వెన్నెల ప్రత్యేకతలివే..
మంగళూరులో ఎంటెక్ చేస్తున్న వెన్నెల.. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌పై దృష్టి పెట్టింది. జూడో, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. తర్వాత.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. యోగా, స్కేటింగ్, బాక్సింగ్, ఆర్చరీ.. వీటన్నింటిలోనూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకుంది.
అయితే.. తండ్రి మరణం తర్వాత.. తల్లి కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వెన్నెల తమ్ముళ్లు పాఠశాల విద్యలో ఉన్నారు. దీంతో.. బాధ్యతల భారం తల్లిపై పడకుండా తోడుగా నిలిచింది. ఎన్.ఐ.టి.లో తరగతులకు హాజరవుతూనే.. తనకు తెలిసిన విద్యల్లో పిల్లలకు మెళకువలు నేర్పుతోంది. చిన్నవయసులో అన్ని బాధ్యతలెలా అన్ని అడిగితే.. సమస్యలు వస్తేనే కదా జీవితపాఠాలు తెలుస్తాయ్ అంటోంది వెన్నెల. ఆత్మవిశ్వాసం పెరగడానికి, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి.. మార్షల్ ఆర్ట్స్ ఎంతో సాయపడిందని చెబుతోంది.
తల్లిదండ్రులు ఆడపిల్లల్ని సున్నితంగా చూడకుండా.. అనుకోని పరిస్థితుల్లో వేగంగా స్పందించడమెలాగో నేర్పాలని సూచిస్తోంది వెన్నెల. మార్షల్ ఆర్ట్స్ సాధనలో గాయాలు సహజమనీ.. మానసిక బలం అక్కడినుంచే మొదలవుతుందని చెబుతోంది. ఎంటెక్ పూర్తయిన తర్వాత పరిశోధకురాలిగా స్థిరపడతానంటున్న వెన్నెల.. సాయుధ దళాల్లో చేరేందుకూ సిద్ధమేనంటోంది. అలాంటి వెన్నెల మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి : Thavaasmi Ramayana Book : నవతరం కోసమే.. "తవాస్మి రామాయణం.."