విశాఖ సాగర తీరం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. తీరానికి సమాంతరంగా కనిపించే తూర్పు కనుమల సొబగులు మనసును కట్టిపడేస్తాయి. ఇసుక తిన్నెలపై కనిపించే రాతి దిబ్బలు రమణీయతకు మరింత సౌందర్యాన్ని జోడిస్తాయి. వీటితో పాటు మంగమారిపేటలోని తొట్లకొండ ఎదురుగా ఇసుక తిన్నెలపై కొలువైన సహజ శిలా తోరణం తీరానికి మరింత వన్నె తెచ్చిపెడుతోంది. రాతి తోరణం మధ్య నుంచి తెల్లటి నురగలతో చొచ్చుకు వచ్చే అలలను ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాల సహజత్వం ఉట్టిపడే ఈ ప్రాంతం పర్యాటకంగాను ప్రత్యేకత సంతరించుకుంది.
సందర్శకుల అత్యుత్సాహం
సందర్శకుల తీరుతో.. శిలా తోరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. భౌగోళిక స్వరూపం విలువను ఏ మాత్రం గుర్తించకుండా దానిపై నిలబడి ఫొటోలు దిగడం.. మరికొందరు దానిపై ద్విచక్రవాహనాలను నిలిపి..అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది.
విరిగిపోయే అవకాశం
అలల తాకిడికి అక్కడి రాయి కరిగి..తోరణంగా ఏర్పడిందని.. బలహీనంగా ఉండే దీనిపై నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా శిలా తోరణం ప్రాధాన్యతను వివరిస్తూ బోర్డులను ఏర్పాటు చేయడం సహా... పర్యవేక్షణ ఉండేలా భద్రతా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి
విశాఖ డెయిరీ పాడి రైతులకు రూ. 35 కోట్ల సంక్రాంతి బోనస్