తెలంగాణలో పేదరికాన్ని రూపమాపడమే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) లక్ష్యమని వైఎస్ షర్మిల (YS Sharmila) ఉద్ఘాటించారు. రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌టీపీ ఆవిర్భావ సభ నిర్వహించారు. వైఎస్‌ఆర్ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకమని షర్మిల అన్నారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినట్లు ఆమె పేర్కొన్నారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమం.. పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
చెరగని సంతకం...
వైఎస్‌ఆర్ చెరగని చిరునవ్వు.. కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమ సంతకమని షర్మిల కొనియాడారు. వైఎస్‌ఆర్ రాజకీయాలకతీతంగా సాయం చేశారని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదని ఆరోపించారు. పేదరికం నుంచి బయటపడింది అంటే.. కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికీ వైఎస్‌ఆర్ పాలనను తలచుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతో మందికి భరోసా ఉండేదని తెలిపారు. సంక్షేమ పాలనలో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ సంక్షేమమంటే గారడిమాటల గొప్పలు.. చేతికి చిప్పలని ధ్వజమెత్తారు.
రెండు నిమిషాలు కూర్చుంటే పరిష్కారం...
తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్లు, విందులు పెట్టుకున్నారన్న షర్మిల... మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. రెండు నిమిషాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోలేరా అని నిలదీశారు. ఏపీ రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్లు తెరిచారా? అని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుందని విమర్శించారు. సమస్య పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోమని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతానికి చెందిన నీటిచుక్కను కూడా తీసుకోమని షర్మిల అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ సిద్ధాంతమని పేర్కొన్నారు.
మేమే అసలైన వారసులం...
ఎంతోమంది నేతలకు వైఎస్‌ఆర్ రాజకీయ భిక్షపెట్టారన్న షర్మిల... వైఎస్‌ఆర్‌ను తిడుతుంటే ఈ కాంగ్రెస్ నేతలు చప్పుడు చేయటం లేదని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత లేదన్నారు. వైఎస్‌ఆర్ అసలైన వారసులం తామే అని ఉద్ఘాటించారు. నేటి నుంచి 100 రోజుల తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని వెల్లడించారు.
ఆ హామీ ఏమైంది?
బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అందాలని షర్మిల ఆకాక్షించారు. పాలనలో కూడా బీసీలకు సరైన భాగస్వామ్యం కల్పించాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌టీపీలో బీసీలకు జనాభా ఆధారంగా సీట్లు ఇస్తామని షర్మిల చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నిత్యం కేసీఆర్ చేతిలో అవమానాలకు గురవుతున్నాయని ఆరోపించారు. ఎస్సీల అసైన్డ్ భూములను కూడా కేసీఆర్ గుంజుకున్నారని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. ఎస్సీని సీఎంగా చేయకపోతే తలనరుక్కుంటానన్న కేసీఆర్... తలకాయ గురించి చెప్పాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడం లేదన్న షర్మిల... ఎస్సీల మానప్రాణాలకు రక్షణ లేదన్నారు.
'వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి ఆయన 72వ జయంతి రోజున వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్టీపీలోని మూడు ముఖ్యమైన అంశాలు సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం. పెట్టే పైసలు పెడతనే ఉన్నాం. పోయే పైసలు పోతనే ఉన్నయి. కానీ రోగం మాత్రం బాగుకావడంలేదన్నట్లు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సాధించుకుని ఇన్ని సంవత్సరాలైనా మేము పేదలమూ మాకు వైట్ కార్డులు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసినా పేదరికం పోలేదు. ఎవరైన బయటపడ్డారంటే అది కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే. అధికారం ఉన్నప్పుడే ఫాంహౌస్ చక్కబెట్టుకోవాలన్నట్లు అందిందల్లా దోచుకుంటున్నారు. దాచుకుంటున్నారు. తప్పైపోయిందని ముక్కు నేలకు రాస్తే పాపం పోతుందా కేసీఆర్. పేదరికం రూపుమాపడమే వైఎస్ఆర్టీ లక్ష్యం.
-- వైఎస్ షర్మిల
ఇదీ చూడండి:
Vijayamma:'తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల'