RRR on Amalapuram incident: అమలాపురం ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా జరిగిందా అని ప్రజలే అంటున్నారన్నారు. అకస్మాత్తుగా ఘటన ఎలా జరిగిందన్న రఘురామ.. ఇంత జరుగుతున్నా ఒక్క ఫైరింజన్ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్ పేరుతో ఉన్న పథకాలన్నీ మార్చాలన్న రఘరామ.. పథకాలకు అంబేడ్కర్ పేరు పెట్టడమే ఆయనకు ఇచ్చే నివాళి అని అన్నారు.
"అమలాపురం ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే జరిగిందేమోనని ప్రజలే అనుకుంటున్నారు. అకస్మాత్తుగా ఎందుకు ఇలా జరిగింది. ఒక్క ఫైరింజన్ కూడా ఎందుకు రాలేదు. హోంమంత్రికి వచ్చిన నివేదికలు ఏంటో తెలియదు"- రఘరామ, వైకాపా రెబల్ ఎంపీ
అమలాపురం రణరంగం : కోనసీమ జిల్లా అమలాపురం మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇవీ చూడండి
'అమలాపురం ఘటనలో పోలీసుల తీరు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం'
అమలాపురం ఘటనలో తెదేపా, జనసేన నాయకులున్నారు: మంత్రి విశ్వరూప్