నాలుగో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అట్టహాసంగా ముగిశాయి. ముగింపు సభలో మాతృ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం తెలుగు రచయితలు పలు తీర్మానాలు చేశారు. ప్రతి ఒక్కరూ మాతృభాష కోసం కృషి చేయాలని... ప్రభుత్వాలు తెలుగు మాద్యమాన్ని కొనసాగించాలని కోరారు. ఊరూరా తెలుగు వేదికల నిర్మాణం కోసం రచయితలు, భాషాభిమానులు ప్రజల గుండె తలుపులు తట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. న్యాయపాలన, ఇతర పాలనా వ్యవస్థల్లో సాంకేతిక పదాల అనువాద విషయంలో నిపుణులు కృషి చేయాలని మహాసభ నిర్వాహకులు పూర్ణచంద్ విజ్ఞప్తి చేశారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు...
తొలిరోజు చమత్కార చతుర్మఖ పారాయణం, అష్టావధానం, ప్రత్యేక కవిసమ్మేళనం వంటి భాషా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన మహాసభలు... రెండో రోజు రాజకీయ రంగ ప్రతినిధుల సదస్సుతో మరోస్థాయికి చేరుకున్నాయి. సంగీత సదస్సులు, సంగీత నవావధానం, తెలుగు వారి నృత్యరీతులు, భాషోద్యమ గీతాలు, కావ్యాల్లో తెలుగు సొగసు, యువత - తెలుగు భవిత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరి రోజు రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు, పత్రిక ప్రసార మాధ్యమరంగ, మహిళా ప్రతినిధుల సదస్సుల్లో... తెలుగు భాష పరిరక్షణపై ప్రధానంగా చర్చించారు.
తెలుగు విస్మరణపై ఆందోళన...
తెలుగు సాహిత్యం, మాతృభాష మనుగడ, అస్థిత్వం, నాగరికత వంటి కోణాల్లో రచయితలు విశ్లేషణ చేస్తూ... మూడు రోజులపాటు సాగిన సభలకు... దేశ విదేశాల నుంచి దాదాపు 15 వందల మంది భాషాభిమానులు, సాహితీవేత్తలు, రచయితలు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యాప్తికోసం విశేషమైన కృషి చేస్తుంటే.... భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగును విస్మరించటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
పత్రిక చదవటం నేర్పించండి...
పత్రికా ప్రసారమాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సులో... తెలుగు భాష ఆధునికీకరణలో పత్రికల పాత్రపై చర్చించారు. భాష రాజకీయ ఒరవడికి నాంది పలికిందని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. మాతృభాష సంరక్షణ కోసం చిన్నప్పటి నుంచే పత్రిక చదవటం నేర్పితే చాలని హాస్య బ్రహ్మ శంకరనారాయణ తెలుగుప్రజలకు సూచించారు.
అలరించిన 'నృత్య దీపిక'
అనంతరం... తెలుగు భాష నాడు - నేడు అనే పేరుతో స్వతంత్ర భారతి రమేష్ శిష్య బృందం అనునయించిన నృత్య దీపిక.... భాష, సాహిత్యాభిమానులను ఎంతగానో అలరించింది. మహిళా ప్రతినిధుల సదస్సు అనంతరం అట్టహాసంగా నిర్వహించిన ముగింపు సభలో... తెలుగు భాష మనుగడకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా... ప్రపంచ తెలుగు రచయితలు ముందుకు రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: