శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య లేఖ రాసింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టానికి వ్యతిరేకంగా సీడబ్ల్యుసీ , అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఏంబీ అనుమతులు లేకుండా పాలమూరు రంగారెడ్డి , డిండి, మిషన్ భగీరథ, భక్త రామదాస, తుమ్మెళ్లతో కలిపి 150 టీఎంసీలతో తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మించటం సరికాదని ఆ లేఖలో పేర్కొంది.
ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు విస్తరణ ప్రాజెక్టులు ఆపాలని ఏపీ నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కేంద్ర జలశక్తి శాఖను కోరింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సాగర్ కింద ఆయకట్టు బీడుగా మారుతుందని వెల్లడించింది. సాగర్ కాల్వల కింద 15.7 లక్షల ఎకరాలు.. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు.. మొత్తంగా ఏపీలో 28.79 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉందని.. సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణ లేఖలో వివరించారు.
మంగళవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలో వీటిపై చర్చించాలని కోరిన గోపాల కృష్ణ.. తెలంగాణ ప్రాజెక్టులు నిలుపుదల చేసి ఏపీ రైతుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు, డిండి కొత్తవని 2016లో కేంద్రం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని... అపెక్స్ కౌన్సిల్ తొలి భేటీలో సాగర్, కృష్ణా డెల్టా రైతులకు న్యాయం జరగలేదని ఏపీ నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య తెలిపారు. గాలేరు, నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ రైతులకు న్యాయం చేయాలని లేఖలో వెల్లడించారు.
ఇదీ చదవండి:
ప్రొద్దుటూరు కుర్రాడి ప్రతిభ... జేఈఈలో ఆల్ ఇండియా రెండో ర్యాంకు