FESTIVAL CELEBRATIONS: చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పుష్పాలంకరణతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
గుంటూరు అమరావతి రోడ్డులో మట్టి గణపతి విగ్రహానికి భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ పూజలు చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో 65వ గణపతి పక్షోత్సవాలు మొదలయ్యాయి. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వజ్రకవచ అలంకారంలో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు.విశాఖ గాజువాకలో భారీ గణపతి కొలువుదీరాడు. 89 అడుగుల ఎత్తులో 6 టన్నుల బరువున్న భారీ విగ్రహాన్ని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దర్శించుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయనగరం వరసిద్ధి వినాయక ఆలయంలో తెదేపా సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చవితి వేడుకల్లో పాల్గొన్నారు. రోలుగుంట మండలం భోగాపురం పాఠశాలలో బాలలు మట్టిగణపతిని ప్రతిష్ఠించి వేడుకలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ విఘ్నేశ్వర ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తణుకు సజ్జాపురంలోని విఘ్నేశ్వరుడ్ని రాజకీయ నేతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఏలూరులో భారీ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.
అమలాపురం సహా కోనసీమ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయినవిల్లిలో సిద్ధి వినాయకుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. యానాంలోనూ చవితి సందడి నెలకొంది. నెల్లూరు జిల్లా కావలి, కందుకూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీ విగ్రహాలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వినాయకుడ్ని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. సంగం మండలం తల్పూరుపాడులో వినాయకుడి విగ్రహం పైకి చిన్న తాబేలు రావటంతో చూసేందుకు జనం ఆసక్తి చూపారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడపలో వినాయక మంటపాలతో సందడి వాతావరణం నెలకొంది. ఎన్జీవో కాలనీ, ఉక్కాయపల్లెలో వినాయకుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. అనంతపురంలో పర్యావరణహిత గణేశుడికి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పూజ చేశారు. రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.
కర్నూలులో వినాయక ఘాట్ వద్ద ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని విఘ్నాలను అధిగమించి రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: