లాక్డౌన్తో సుమారు 5 నెలలుగా అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్ పడింది. మార్చి 22న ఆగిపోయిన అంతరాష్ట్ర సర్వీసులు తిరిగి ప్రారంభం కాలేదు. రాష్ట్ర సర్వీసుల ఒప్పందంపై విస్తృతంగా చర్చలు జరిగినా... అవి కొలిక్కి మాత్రం రావడం లేదు. 50 కిలోమీటర్ల దూరం ఒప్పందం వద్దనే సమావేశాలకు బ్రేక్ పడుతోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులతో పోల్చితే ఏపీ బస్సులు అదనంగా 1.12 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఆ అదనపు కిలోమీటర్లు తగ్గించుకోవాలని ఇటీవల హైదరాబాద్లోని బస్ భవన్లో జరిగిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు సూచించారు. కానీ... వారు మాత్రం 55 కిలో మీటర్లు మాత్రమే తగ్గించుకుంటామని... మిగిలిన 50 కిలో మీటర్లు తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పుకోవచ్చని తెలిపారు. దీంతో మరో వారం తర్వాత సమావేశం నిర్వహించుకుందామని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.
సమన్యాయం ఉండాలి..!
ఈ నెల 15న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్లోని బస్ భవన్లో మరోమారు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ 2.64 లక్షల కిలో మీటర్లు తిప్పుతోంది. అదే విధంగా ఏపీలో తెలంగాణ 1.52లక్షల కిలో మీటర్లు తిప్పుతోంది. తెలంగాణ కంటే ఏపీ అదనంగా 1.12 లక్షల కిలో మీటర్లు తిప్పుతోంది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమీక్షా సమావేశంలో అంతర్ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల నిర్వహణలో సమన్యాయం పాటించాలని సూచించారు. ఏపీ ఎన్ని కిలోమీటర్లు తెలంగాణలో తిప్పితే... అన్ని కిలో మీటర్లు తెలంగాణ బస్సులు ఏపీలో తిప్పాలి కానీ... ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఈ అంశం కొలిక్కి రాలేదు. గతంలో ఏపీలో, ఇటీవల హైదరాబాద్లో... మళ్లీ ఈ నెల 15న ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కావాలన్న నిర్ణయంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారుల సమావేశం కొలిక్కివస్తేనే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది.