ప్రభుత్వం నెలరోజుల్లో 8.86 లక్షల రేషన్ కార్డులను తొలగించిందని.. తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. దాదాపు 30 లక్షల మంది రేషన్ సరకులకు దూరమయ్యారని వీడియో కాన్ఫరెన్స్‌లో మండిపడ్డారు. బినామీల జేబులు నింపడానికి.. పేదల నోటి దగ్గర కూడు లాక్కునే స్థాయికి సీఎం జగన్ దిగజారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల నుంచి దోచుకుని ధనవంతులకు పంచే వింత ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నామని విమర్శించారు. గుట్కా నమిలిన విధంగా.. పౌరసరఫరాల శాఖను మంత్రి నమిలేస్తున్నారని దుయ్యబట్టారు.
రేషన్ సరకుల పంపిణీ కోసం భారతీ పాలిమర్స్‌కు రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారని అనిత ఆరోపించారు. గ్రామాల్లో నెలకు రూ. 10 వేలకు మించి ఆదాయం ఉంటే రేషన్ కార్డు తొలగించటం దారుణమన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేతకాక.. ప్రజా సంక్షేమాన్ని కుదించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉచితంగా రేషన్ ఇవ్వాల్సింది పోయి.. వింత పోకడలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రక్షిత మంచినీరు అందించే పరిస్థితి లేదని.. నాయకుల మాదిరిగానే వాలంటీర్లూ అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి:
సామాజిక సేవలో యువత భాగస్వామ్యం.. గ్రామానికి రెండు క్లబ్‌ల దిశగా చర్యలు