వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి... తన ఇంట్లోని పని మనుషులను బినామీ డైరెక్టర్లుగా పెట్టుకుని అదాన్ డిస్టిలరీస్‌ను నడిపిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆ సంస్థ రూ.10.60 కోట్లు చేబదుళ్లుగా పొందినట్లు ఆడిట్ రిపోర్టులో ఉందని, ఈ సొమ్ముంతా విజయసాయిరెడ్డిదేనని స్పష్టం చేశారు. అదాన్ డిస్టిలరీస్‌లో మొదట విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, సీఎం జగన్ బంధువు ముప్పిడి అనిరుధ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ విషయాన్ని తెదేపా బయటపెట్టడంతోనే కాశీచయనుల శ్రీనివాస్, బొల్లారం శివకుమార్‌లను డైరెక్టర్లుగా పెట్టుకున్నారని వివరించారు. వీరిద్దరి ప్రొఫైళ్లు ఏంటనేది ఎంత వెతికినా దొరకలేదని, ఇద్దరూ జగన్, విజయసాయిరెడ్డిల బినామీలేననేది స్పష్టమవుతోందని ఆరోపించారు. మంగళగిరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దమ్ముంటే శ్రీనివాస్, శివకుమార్ తామెవరో ప్రజలకు చెప్పాలని డిమాండు చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌కు సిద్ధమా?
‘బెవరేజస్ కార్పొరేషన్ అమ్ముతున్న మద్యంలో 75% జగన్, విజయసాయిరెడ్డి బినామీ కంపెనీల్లో తయారయ్యేదే. కార్పొరేషన్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే ఆ విషయం బయటపడుతుంది. దీనికి వారిద్దరూ సిద్ధమేనా? 2019 డిసెంబరు 2న ప్రారంభమైన అదాన్ డిస్టిలరీస్ కంపెనీ టర్నోవర్ రూ.3వేల కోట్లు దాటింది. ఆ కంపెనీ కార్యాలయం హైదరాబాద్‌లో 1,100 అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతటి తక్కువ విస్తీర్ణంలోనే డిస్టిలరీ కార్యకలాపాలు సాధ్యమేనా? అదాన్ డిస్టిలరీస్‌లో రూ.50వేల పెట్టుబడి పెట్టి రెండేళ్లలో దాని టర్నోవర్‌ను రూ.2,500 కోట్లకు తీసుకెళ్లారు. మద్య నిషేధం అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.25వేల కోట్ల విలువైన మద్యం అమ్మారు. అదాన్ డిస్టిలరీస్ లాంటి బినామీ కంపెనీలు మరిన్ని ఉన్నాయి. ఆ వివరాలనూ బయటపెడతాం. అదాన్ డిస్టిలరీస్ సరఫరా చేసే మద్యం క్వార్టర్ బాటిల్‌ను ఏపీఎస్‌బీసీఎల్ రూ.36కు కొనుగోలు చేసి రూ.200కు అమ్ముతోంది.
ఆ మద్యంలో విష రసాయనాలున్నాయ్.. తాగొద్దు
వైకాపా ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో విష రసాయనాలు ఉన్నాయి. అది తాగొద్దు. ఆ మద్యం తాగే ఇటీవల ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారమంతా జగన్ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. జగన్.. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వ ధనదాహం తీరుతుంది? తెదేపా హయాంలో అమ్మిన మద్యం, వైకాపా ప్రభుత్వ హయాంలో అమ్ముతున్న మద్యంపై స్వతంత్ర విచారణకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? 2019 అక్టోబరు నుంచి 2020 ఫిబ్రవరి మధ్య 106 మద్యం బ్రాండ్లకు వైకాపా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ తర్వాత మరికొన్ని బ్రాండ్లు వచ్చాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలోనూ మద్యం ఆదాయంపై అక్కడి ప్రభుత్వం అప్పు తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ఆదాయాన్ని హామీగా చూపించి భారీగా అప్పులు తెచ్చారు. బడుల్ని మూసేస్తూ.. మద్యం దుకాణాల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. దీన్నిబట్టే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏమిటో అర్థమైపోతోంది’ అని ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.
"అదాన్ డిస్టిలరీస్‌కు రూ.10 కోట్లు రుణం ఎవరిచ్చారు. ఆర్టీఐ ద్వారా సరైన సమాచారం కూడా రావట్లేదు. బంధువులైనందున వైఎస్ భారతమ్మ ఇచ్చారా ?. అదాన్ డిస్టిలరీస్‌కు రుణం వైఎస్ జగన్ ఇచ్చారా ? తేలాలి. స్వతంత్ర సంస్థతో విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా ?. మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని శిక్షించాలి. విచారణకు మీరు సిద్ధమైతే హైకోర్టులో వేసేందుకు మేము సిద్ధం. ఇరువర్గాలు కలిసి స్వతంత్ర విచారణ కోరుదాం. గతంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న మద్యం బ్రాండ్లు ఉండేవి. కక్కుర్తి పడి డబ్బుల కోసం మీరు మద్యం బ్రాండ్లు తెస్తున్నారు." -ఆనం వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం నేత
ఇవీ చూడండి