Bore Flows without motor: ఆరేళ్ల క్రితం ఓ రైతు.. తన పొలానికి నీటి వసతి లేకపోవడంతో బోరు వేయాలని నిర్ణయించారు. ఒకసారి వేసినపుడు నీరు పడలేదు. రెండో సారి వేశారు. ఈ సారి కూడా డబ్బులు వృథా అయ్యాయి కానీ చుక్క నీరు పడలేదు. మూడో ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ రైతు బాధను గంగమ్మ అర్థం చేసుకుందేమో.. కరుణించి ఇక అప్పటి నుంచి అతని పొలానికి సాగు నీటి కష్టాలను తీరుస్తూనే ఉంది. ఈ ఆరేళ్లలో బండలు పగిలే ఎండలు మండినా.. ఆ బోరు మాత్రం ఎండిపోలేదు. నిరంతరం జలధార పారుతూనే ఉంది. విచిత్రం ఏమంటే.. ఆ రైతు ఈ బోరు వేసినప్పటి నుంచి మోటారు అవసరం లేకుండానే గంగమ్మ ప్రవహిస్తోంది. దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కాలంతో సంబంధం లేదు..
Bore Flows without motor in shivapuram: తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన కుంట రంగారెడ్డి ఆరేళ్ల క్రితం వేసిన బోరు నుంచి నిరంతరంగా జలాలు వస్తూనే ఉన్నాయి. వేసవి, చలి, వానా కాలం ఇలా ఏ కాలంలోనూ ఆ జలధార ఇంకిపోకుండా నిరంతరం బోరు బావి నుంచి మోటార్ సహాయం లేకుండానే పోస్తూనే ఉంటుంది. ఆరేళ్లుగా ఏ రోజూ బోరుబావి నుంచి నీళ్లు రావడం ఆగిపోలేదని రంగారెడ్డి చెబుతున్నారు.
"వానాకాలం, ఎండాకాలం అనే తేడాలేకుండా నిరంతరం ఈ బోరు నుంచి జలధార కొనసాగుతూనే ఉంటుంది. ఆరేళ్ల క్రితం వేసిన ఈ బోరు ఇప్పటి వరకూ ఇంకిపోయిన దాఖలాలు లేవు. ఈ బోరు కింద మా 20 ఎకరాలు సాగవుతున్నాయి. మా పొలం పక్కనున్న మరికొందరికి చెందిన పదెకరాలు సాగవుతున్నాయి. మోటారు లేకుండా బోరు పనిచేయడమే కాకుండా ఇంతమందికి ఉపయోగపడటం ఆనందంగా ఉంది." -కుంట రంగారెడ్డి, రైతు శివాపురం
మరో 10 ఎకరాలు..
ఈ బోరు బావి కింద వారి కుటుంబానికి చెందిన 20 ఎకరాలు సాగవుతున్నాయి. అంతే కాకుండా సమీప రైతులకు చెందిన మరో 10 ఎకరాల్లో ఖరీఫ్, యాసంగి రెండు పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరో పది బోరుబావుల వరకు ఇలాగే నీరు పోస్తున్నాయని.. కానీ ఈ బోరు నుంచి మాత్రం ఎక్కువ నీరు వస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ రికార్డులు నాశనం చేసేందుకే.. కోర్టులో బాంబు దాడి!