సినిమా టికెట్ల ధరలు ఖరారు చేసేందుకు నిబంధనల రూపకల్పనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలి...
గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా... చట్టప్రకారం టికెట్ల ధరలను ఖరారు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది జీఎల్ నర్సింహారావు వాదించారు. టికెట్ల ధరల ఖరారు కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. కమిటీ సూచనలు, సిఫార్సులపై ఏం నిర్ణయాలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి..
ఇటీవలే... పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో... వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో నంబర్ 63ను తాజాగా సవరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. మల్టీప్లెక్స్‌లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో... పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై.. థియేటర్ నిర్వాహకులకే వదిలేసింది.