కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకొనేందుకు అనుమతివ్వాలని తెలంగాణ.. సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు దరఖాస్తు చేసింది. రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకొంటే న్యాయసలహా తీసుకొని అంతర్రాష్ట్ర జల వివాదచట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్‌కు పంపే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని గత ఏడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి మంత్రి చెప్పారు.
ఈ విషయంపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు తగ్గట్లుగానే తెలంగాణ తాజాగా ఈనెల ఏడున సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నది తేల్చాలని అప్పటికే ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం ఈ పని చేయాలని కోరింది.
మాకు అన్యాయం జరిగింది...
‘‘కృష్ణా బేసిన్‌లోని మా రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. బేసిన్‌లో నీటి అవసరాలు పట్టించుకోకుండా పక్కబేసిన్‌కు మళ్లిస్తున్నారు. మొదటి ట్రైబ్యునల్ బచావత్ వద్ద నాడు మాకు వాదన వినిపించే అవకాశం లేకపోయింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. మా అవసరాల గురించి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిగా వాదించలేదు. కాబట్టి మొత్తం కృష్ణా జలాలపై సెక్షన్-3 ప్రకారం విచారణ చేయించాలి’’ అని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఇది పెండింగ్‌లో ఉంది.
పునర్విభజన చట్ట ప్రకారం వద్దు
‘‘కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసింది. ప్రస్తుత వివాదం పునర్విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య తప్ప మాకు సంబంధం లేదు’’ అని కర్ణాటక, మహారాష్ట్రలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కాకుండా, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విచారణ చేపట్టాలని 2018లో తెలంగాణ కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి, అప్పటి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జల్‌శక్తి మంత్రికి, కార్యదర్శికి లేఖలు రాశారు.
అయితే.. దీనిపైనా ఎలాంటి ముందడుగు పడలేదు. గత అక్టోబరు ఆరున కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కృష్ణా జలాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్‌కు నివేదించాలని తాము కోరినా పట్టించుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా తామేమీ చేయలేమని, ఉపసంహరించుకొంటే న్యాయసలహా తీసుకొని సెక్షన్-3 ప్రకారం నివేదించే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్లుగా ఇప్పుడు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణకు తెలంగాణ దరఖాస్తు చేసింది.
ఇదీ చూడండి:
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులతో నేడు లోకేశ్ సమావేశం