Vijayawada Government school: మార్కుల వెంట పరిగెత్తడమే విద్యగా మారిపోయిన ఈ రోజుల్లోనూ.. విజయవాడలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.. విద్యార్థుల్లో దేశభక్తిని తట్టి లేపుతున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరుల గాథలను వారికి తెలియజేస్తూ.. మంచిమార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు.
విజయవాడలోని దళవాయి సుబ్బరామయ్య నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు విద్యతో పాటు మహనీయులు జీవిత గాథలను బోధిస్తూ విద్యా వ్యవస్థకే మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏడాది కాలంగా ఈనాడు దినపత్రిక స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది. అందరికి తెలిసిన, బాగా ప్రాచుర్యం ఉన్న నేతల గురించే కాకుండా ఎవరికీ తెలియని, మరుగున పడిపోయిన ఎన్నో గాథలను, ఎంతోమంది వీరుల త్యాగాలను వెలికితీసి అందిస్తోంది. ఈ విషయాలను విద్యార్థులకు అందించాలని భావించిన ఉపాధ్యాయుల ప్రతిరోజూ ఈనాడు పేపర్‌లో వచ్చిన కథనాన్ని పాఠశాలలో ప్రదర్శించడమేగాక వాటిని విద్యార్థులతో చదివించి అందరికీ వినిపిస్తున్నారు. ఈ కథనాలపై ప్రత్యేక చర్చలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తున్నారు.
తమకే తెలియని ఎన్నో విషయాలను ఈనాడు దినపత్రిక ద్వారా తెలుసుకున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ఎందరో మహనీయుల జీవితగాథలను విద్యార్థులకు తెలియజేస్తున్నామన్నారు. వారి పోరాట పటిమ, అనుసరించిన ఉత్తమ మార్గాలు విద్యార్థులకు ఎంతో ప్రేరణనిస్తున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: