రాష్ట్రంలో డ్రగ్ మాఫియా(drug mafia) చెలరేగిపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) మండిపడ్డారు. తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశాలతోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. మత్తుతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఆన్లైన్ సమావేశం(online meeting) నిర్వహించారు. డ్రగ్స్ దిగుమతి, గంజాయి, గుట్కా, మద్యం, గనులు, ఇసుక, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా హవాలా రూపంలో విదేశాలకు రూ.వేల కోట్లు తరలిపోతున్నాయని ఆక్షేపించారు. డ్రగ్స్ డాన్లుగా, స్మగ్లింగ్ కింగ్‌లుగా వైకాపా ముఖ్య నేతలు అవతారమెత్తారని విమర్శించారు.
అవినీతి చేయడంలో సీఎం జగన్ దిట్ట...
పండోరా పేపర్స్‌లో(pandora papers) పన్ను ఎగవేతదారుల వివరాలు లీక్ అయ్యాయని, ఇండియా నుంచి దాదాపు 380 మంది వరకు ఈ వ్యవహారంలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. వీరిలో రాష్ట్రం నుంచి ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. షెల్ కంపెనీలు సృష్టించి అవినీతి(corruption) చేయడంలో జగన్ మోహన్ రెడ్డి దిట్ట అని చంద్రబాబు ఆక్షేపించారు. కరోనా(corona)ను నియంత్రించడంలో సీఎం జగన్.. నిర్లక్ష్యం వహిస్తున్నారని అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్న రైతులను అదుకునేవారు కరవయ్యారన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ నిధుల్ని రైతులకు అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల్లో పంటను చేర్చకుండా, ఈ క్రాప్ బుకింగ్, ఇన్ పుట్ సబ్సీడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లింపు వంటివి రైతులకు దక్కకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
అమరావతిని నాశనం చేశారు...
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల(tidco houses)ను లబ్ధిదారులకు అందించలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోగా, ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవటాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సమావేశంలో తెదేపా నేతలు నిర్ణయించారు. ప్రజారాజధాని అమరావతి(amaravathi)ని నాశనం చేసి, యువత ఉద్యోగాలు లేకుండా నష్టపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల సంక్షేమానికి తెదేపా ప్రవేశపెట్టిన పథకాలను.. జగన్ రెడ్డి రద్దు చేసి వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెండింగ్ ఉపాధి హామీ, నీరు చెట్టు బిల్లులపై న్యాయపోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. విశాఖ, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర ఖజనాను దోచుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఆందోళనలకు పిలుపు...
రెండున్నరేళ్ల పాలనలో 6సార్లు విద్యుత్ ఛార్జీ(current bills)లను పెంచటం ద్వారా రూ.11500కోట్లు, పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.24500కోట్ల అప్పు కలిపి ప్రజలపై రూ.36వేలకోట్ల భారం మోపారని చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెలాఖరు వరకూ వినియోగదారుల తరఫున ఆందోళనలు(protest) నిర్వహించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. నేటి నుంచి పదో తేదీ వరకూ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విద్యుత్ ఛార్జీల భారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. 11 నుంచి 17 వరకు గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, 18 నుంచి 24 వరకు తెదేపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గ్రామాల్లో పర్యటించి, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలతో చర్చిస్తారని చంద్రబాబు తెలిపారు. 25 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర, జోనల్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. వైకాపా నేతలు డ్రగ్స్ డాన్స్, స్మగ్లింగ్ కింగ్‌లుగా మారారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవుతోంది. లిక్కర్ మాఫియా డబ్బు హవాలా దారిలో విదేశాలకు వెళ్తోంది. ప్రకృతి విపత్తులకు రైతులు నష్టపోతున్నా ఆదుకునేవారు కరవయ్యారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర రైతులకు అందడం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 31 వరకు ఆందోళనలు చేపడతాం. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇవీచదవండి.