‘పెట్రో మోతను తగ్గించాలి.. నిద్ర నటిస్తున్న ముఖ్యమంత్రి మేల్కొనాలి’ అంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకుల వద్ద వినియోగదారులతో కలిసి వాహనాల హారన్లు మోగించారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, బైఠాయింపులు, వినూత్న ప్రదర్శనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ధరలు తగ్గించాలి’ అని డిమాండు చేశారు. ‘పెట్రోలు, డీజిల్‌పై దేశంలోనే అత్యధిక వ్యాట్ జగన్ సర్కారు వసూలుచేస్తోంది. గత రెండున్నరేళ్లలో వీటిపై రూ.28 వేల కోట్ల పన్నులు వసూలుచేశారు. రహదారుల అభివృద్ధి సెస్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్న మొత్తంతో రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేసిన దాఖలాల్లేవు. ఈ పెట్రో ఆదాయం ఏమైంది?’ అని ప్రశ్నించారు. నిరసనల సందర్భంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టుచేయగా, మరికొందరిని ముందే గృహనిర్బంధం చేశారు.
వాహన ర్యాలీలు
* ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి 3కి.మీ. మేర సైకిల్ తొక్కుతూ రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని పెట్రోలు బంకు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
* మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో, గన్నవరంలో ఎమ్మెల్సీ అర్జునుడి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై, సూళ్లూరుపేట నియోజకవర్గ తెదేపా బాధ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహన ప్రదర్శనలు నిర్వహించగా ఉంగుటూరులో హారన్లు మోగించారు.
విజయనగరం జిల్లా సాలూరు ప్రధాన రహదారిలో వాహనానికి తాడుకట్టి లాగుతున్న పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి, నేతలు
వినూత్న ప్రదర్శనలతో
* గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరులో స్కార్పియోను తాళ్లతో లాగారు.
* నర్సీపట్నంలో చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో స్కూటరు చక్రాలు ఊడదీసి సైకిల్ చక్రాలు బిగించి నడిపించారు.
* పెట్రోలు ధరలు తగ్గించాలని వేమూరులో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు.
* తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ పంపులకు పూలమాల వేసి టెంకాయ కొట్టి నిరసన తెలిపారు.
* రంగంపేటలో ఆళ్ల గోవిందు ఆధ్వర్యంలో పెట్రోలు బంకు సిబ్బందికి, పోలీసులకు, వాహన చోదకులకు గులాబీ పూలు అందించారు.
* కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురంలో తెదేపా నాయకులు లారీని కొంతదూరం లాగారు.
ధర్నాలు.. బైఠాయింపులు
విజయవాడ బెంజిసర్కిల్‌లో, గాంధీచౌక్‌లో తెదేపా సీనియర్ నేతలు ధర్నాచేయగా, తెనాలిలో మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఆధ్వర్యంలో తెనాలి-గుంటూరు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు. నరసరావుపేటలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో వినుకొండ రోడ్ జంక్షన్‌లోని పెట్రోల్ బంకు ఎదుట బైఠాయించారు. చెన్నేకొత్తపల్లిలో పరిటాల శ్రీరామ్ బైఠాయించారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
* ఎంపీ రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరాపాడు జాతీయ రహదారిలోని పెట్రోలుబంకు వద్ద నిరసన చేపట్టారు.
కర్నూలు జిల్లా బుక్కాపురంలో లారీని లాగుతున్న తెదేపా శ్రేణులు
అడ్డుకున్న పోలీసులు
* అమలాపురంలో నిరసనను పోలీసు అధికారులు అడ్డుకున్నారు.
* రావులపాలెం, అమలాపురాల్లో సాక్షి దినపత్రికకు నిప్పంటించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
* కడపలో నిరసన తెలిపేందుకు వెళుతున్న మల్లెల లింగారెడ్డి, బీటెక్ రవి, పుట్టా సుధాకర్ యాదవ్, అమీర్ బాబు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితర నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టుచేశారు. శ్రీనివాసులరెడ్డిని గృహనిర్బంధం చేశారు. పులివెందులలో ధర్నా చేస్తున్న తెదేపా నేతలను అరెస్టుచేశారు.
ఇదీ చదవండి: