పర్యటన అనేది పౌరుల హక్కు అని, ఎన్నికల సంఘం అనుమతి అవసరం లేదని.. యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పారు. జగన్ ఆదేశాలనుసారం పోలీసులు క్రూరమైన చర్యలకు పాల్పడుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా పేరుతో చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడేందుకే విశాఖ వచ్చిన జగన్ను విమానాశ్రయం వద్ద అప్పుడు పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. కేంద్రం ముందు తలవంచుతున్న జగన్ ప్రత్యేకహోదాపై ఎందుకు పోరాడటంలేదని దుయ్యబట్టారు.
అనుమతి కోరినా...
చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి వైకాపా పెయిడ్ ఆర్టిస్టులను పంపుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. చంద్రబాబు పర్యటనపై ఆదివారమే పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. నిరసన తెలపటానికి మాత్రమే అనుమతి కోరితే 5 వేల మందితో నిరసన అని పోలీసులు కల్పించారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల పట్ల ఎన్నికల సంఘం నాటకాలాడుతోందని నక్కా వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని చెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
వైకాపాకు వణుకు: అశోక్ బాబు
చంద్రబాబు పర్యటనను తరచూ అడ్డుకోబట్టే వైకాపా స్థాయి ప్రతిసారీ దిగజారుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. 90శాతం ప్రజాబలం ఉందని చెప్పుకుంటున్న వైకాపాకు చంద్రబాబుని చూసి ఎందుకు వణికిపోతోందని ప్రశ్నించారు. తనను అడ్డుకునే హక్కులేదని చంద్రబాబు చెప్పినా పోలీసులు ఎందుకు వినటం లేదని నిలదీశారు.
ఇదీ చదవండి: విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు