రాష్ట్రంలో ఎస్సీలు ధైర్యంగా బతికే పరిస్థితి లేదని తెదేపా అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ విమర్శించారు. వైకాపా పాలనలో అడుగడుగునా.. వేధింపులు, హింస, అవమానాలే ఎదురవుతున్నాయని మండిపడ్డారు. మేనమామనంటూ నమ్మించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు లేకుండా చేసి తన కాళ్లకిందే అంతా ఉండాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీలంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలుగు భాషను దిగజార్చేలా జగన్ రెడ్డి చర్యలు..
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న తెలుగు భాషను దిగజార్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. "ఇప్పటికే సొంత చెల్లి, తల్లిని రోడ్డున పడేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాతృభాషను సైతం రోడ్డుకీడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో తెలుగు అనే పదం ఉన్నందుకే ఈ కక్షసాధింపు ఆలోచనలు చేస్తున్నారా ?. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తప్ప మరెవరూ సమర్థించట్లేదు. తెలుగు భాష మాధుర్యం, గొప్పతనాన్ని పదవుల కోసం సీఎం తాకట్టుపెట్టారు. తెలుగు అకాడమీ పేరు మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి" అని సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు.
ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను తోలుబొమ్మల్ని చేయడమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పే అధికార వికేంద్రీకరణా అని తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. హైకోర్టు రద్దు చేసిన జీవో నంబర్ 2ని సవరణలతో తిరిగి తీసుకొస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇదీ చదవండి..
CM JAGAN: 'గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావాలి'