తొలగించిన ఆప్కాస్(ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్ సర్వీసెస్) ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవటంతో పాటు 20 నెలల పెండింగ్ జీతం బకాయిలను తక్షణమే చెల్లించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సొంత వారిని కొలువుల్లో కూర్చోబెట్టేందుకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించటం సరికాదంటూ మండిపడ్డారు. జీతాలిచ్చే ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కాస్ పరిధిలోకి తీసుకొస్తూ.. మరో మోసానికి తెరలేపారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ(TDP LEADER NARA LOKESH LETTER TO CM JAGAN) రాశారు. సీఎం ఇచ్చిన హామీలను ఆయనకే గుర్తు చేస్తూ ఇలా లేఖలు రాయాల్సి రావటం విచారకరమన్నారు.
ఒక్క వైద్యారోగ్య శాఖలోనే వేలాదిమందిని ఆప్కాస్‌లో తీసుకున్నట్లు పత్రాలివ్వటంతో పాటు సీఎఫ్ఎంఎస్ గుర్తింపు కార్డులు సృష్టించి వారి గొంతు కోశారని విమర్శించారు. ఏజెన్సీలు లేకుండా జీతాలివ్వలేమంటూ 20 నెలల బకాయిలు ఎగ్గొట్టి.. చివరికి ఉద్యోగాలను తొలగించటం దారుణమన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను ఎటు దారి మళ్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎఫ్ఎంఎస్లో నమోదు చేయడం వల్ల తెల్ల రేషన్‌కార్డులు రద్దవ్వటంతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆప్కాస్ ఉద్యోగులు అనర్హులయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ ఇచ్చిన మాట తప్పి ఉద్యోగాలే లేకుండా చేయటం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఇప్పటి వరకూ కాకినాడ జీజీహెచ్‌లో 66 మందిని, 1700 యూపీహెచ్‌సీ ఉద్యోగులను, 180 మంది ఆప్కాస్ ఉద్యోగులను తొలగించారన్నారు. పెండింగ్ జీతాలు అడుగుతున్నారని 600 మందిని తొలగించటం అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు. సొంత మీడియాకు ప్రకటనల కోసం ఆగమేఘాలపై నిధులు విడుదల చేస్తూ చిరుద్యోగుల్ని మాత్రం ఆకలి కేకలతో రోడ్డున పడేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
CM JAGAN WISHES: ప్రజలకు ముఖ్యమంత్రి జగన్.. దసరా శుభాకాంక్షలు