Lokesh On Pending Bills:ఉపాధి హామీ పథకంలో భాగంగా 2018-19లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వడ్డీతో సహా ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 25 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ప్రతి గ్రామంలో పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, 12,918 గ్రామ పంచాయతీలలో ఎల్ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేశామన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం తాము పనిచేశామన్నారు.
కానీ.. ఈ ముఖ్యమంత్రి చేతగానితనం, నియంతృత్వ పోకడల వల్ల ఆనాడు గ్రామాల అభివృద్ధికి వారధులుగా నిలిచిన గుత్తేదార్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల 50 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కొన్ని వందల మంది తమ ఆస్తులు అమ్ముకున్నారని, కొంతమంది తమ ఆస్తులను తాకట్టు పెట్టుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేగా నిధులతో గత ప్రభుత్వ హయంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.
నేడు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజల నుంచి వేల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. హైకోర్టు సహకారంతో రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులు వచ్చాయని..,ఇంకా రావాల్సిన బకాయిల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రతి పైసా వడ్డీతో సహా వచ్చేవరకు నరేగా ఫిర్యాదుల విభాగం పని చేస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
TDP On Amravati Maha sabha: 'అమరావతి ఐకాస సభ.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది'