LETTER ON AMUL MILK: పాడి రైతులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, రాష్ట్రంలో గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు బ్రాండ్‌కు ప్రచారకర్తలా వ్యవహరించడంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలోని పాడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై తన లేఖలో పేర్కొన్నారు. పాలు లీటర్‌కు రూ. 4 బోనస్ ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పాడి రైతులను, వారి సమస్యలను గాలికి వదిలేసి.. అమూల్‌కు ప్రమోటర్‌గా మారడాన్ని విమర్శించారు. అమూల్‌పై చూపిస్తున్న శ్రద్ధ.. పాడి రైతులపై ఎందుకు చూపడం లేదని నిలదీశారు.
అమూల్ తో లబ్ధి అవాస్తవం..
రాష్ట్ర నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం అమూల్ కోసం దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం సభలో అవాస్తవాలు ప్రచారం చేశారంటూ లేఖలో మండిపడ్డారు. స్థానిక డైయిరీలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమూల్ వల్ల లీటర్‌కు రూ. 5 నుంచి రూ. 20 వరకు అదనంగా లబ్ధి అవాస్తవమని వివరించారు. గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
పెద్దిరెడ్డి డెయిరీలో అత్యంత తక్కువ ధరకు పాల కొనుగోలు..
అమూల్ కోసం రూ. 3 వేల కోట్లు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో వైకాపా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి పాల డైయిరీ.. రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు పాలు కొంటున్న విషయాన్ని లేఖలో ముఖ్యమంత్రికి తెలిపారు. శివశక్తి డైయిరీ లీటర్‌కు రూ. 18 మాత్రమే రైతులకు చెల్లిస్తోందని వివరించారు. లీటర్‌కు రూ. 18 మాత్రమే చెల్లించి పాడి రైతుల రక్తాన్ని పీల్చుతున్నారని మండిపడ్డారు.
సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేందుకే ఇలా..
దేశంలో ఎక్కడైనా లీటర్ పాలకు రూ. 18 చెల్లిస్తున్నారా? అని నిలదీశారు. రాష్ట్రంలో సహకార డైయిరీలు, ఇతర సంస్థలను వదిలిపెట్టి బాలామృతం, అంగన్ వాడీలకు పాల సరఫరాకు అమూల్ తో ఒప్పదం చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఉన్మాద, కక్షసాధింపు చర్యలతో ఆయా డైరీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సహకార డైయిరీలను పునరుద్ధరిస్తామని సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెదేపా నేత అచ్చెన్నాయుడు తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Kodali Nani on Casino: తెదేపా నేతలకు జీవితకాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం: కొడాలి నాని
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!