TDP fact finding Committee: ఎమ్మెల్సీ అనంతబాబు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు కుట్రతో సుబ్రహ్మణ్యంను హత్య చేస్తే.. ప్రమాదవశాత్తు జరిగిన హత్యగా పోలీసులు కట్టుకథ అల్లారని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి నాయకత్వంలో మహిళల తాళిబొట్లు తెంపే కార్యక్రమం ఏపీలో నడుస్తోందని మండిపడ్డారు. జగన్ సారధ్యంలోని వైకాపా నేతలు.. దళితుల్నే లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీకి కొమ్ముకాస్తూ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అన్యాయం చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెదేపా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఆనంతబాబు అరెస్ట్ అనంతర పరిణామాలపై చర్చించారు. ఆనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు... గవర్నర్‌ను కలిసి నివేదిక అందచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెదేపా బృందం.. గవర్నర్ సమయం కోరినట్లు చెప్పారు. కాకినాడ ఎస్పీ తన పదవికి అవమానం కలిగించేలా నిన్న మీడియా సమావేశం నిర్వహించారని విమర్శించారు.
ఓ హంతకుడి పట్ల పోలీసులు సకల మర్యాదలతో వ్యవహరించారని తెదేపా ఎస్సీసెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీపరిశ్రమలో రచయితల కొరత లేదన్నట్లు... పోలీసులు కట్టుకథ అల్లారన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు మొదటి నుంచీ పోలీసులు సహకరించారని దుయ్యబట్టారు. ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పిన ప్రతీమాటా ఖాకీ కట్టుకథేనని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: