కేంద్రంలో మోదీ ఉన్నా ఇంకెవరున్నా....ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించి తీరుతామని విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని రాణిగారితోట, రామవరప్పాడు, గీతానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, అడుగడుగునా మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా స్థానికులను పలకరిస్తూ... ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానిక రాణిగారితోటలో తెదేపా ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు.
సమస్యలను పరిష్కరించి ఓట్లు అడిగేది తెదేపా అయితే... అవాస్తవ హామీలతో వైకాపా నేతలు ఓట్లు అడుగుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించామని, మరో అవకాశం ఇస్తే... అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ... విజయవాడ పౌరుషాన్ని దిల్లీలో చాటిన ఘనత మనకే తెదేపాకే దక్కుతోందని... ప్రజలు ఆశీర్వదిస్తే వారి నమ్మకాన్ని నిలబెట్టేలా కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నాని వెల్లడించారు.
ఇదీ చదవండి.... 'బలహీనవర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి.. జగ్జీవన్ రాం'