ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచుతామన్న జగన్..అధికారంలోకి వచ్చాక కేంద్రం ముందు సాగిలపడి శాలువాలు కప్పటంతో సరిపెడుతున్నారని మాజీ మంత్రి అలపాటి రాజా ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాల కోసమే జగన్ దిల్లీ పర్యటనకు వెళ్లారన్నారు. రెండేళ్లల్లో 12 సార్లు దిల్లీ వెళ్లి కనీసం 12 రూపాయలు కూడా సాధించుకురాలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇకనైనా దిల్లీ పర్యటనలు మానేస్తే ప్రజల సొమ్ము కొంతైనా వృథా కాకుండా ఉంటుందని హితవు పలికారు.
30 మంది వైకాపా ఎంపీలున్నా పార్లమెంట్లో ఉత్సవ విగ్రహాలుగా మారారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఏనాడూ పోరాడలేదని అలపాటి ఆక్షేపించారు. ప్రతిపక్షంలో ప్రత్యేకహోదా సాధన పేరిట రాజీనామాలు చేసిన ఎంపీలు ఇప్పుడెందుకు చేయట్లేదని నిలదీశారు. అధికారం కోసమే నాడు రాజీనామా నాటకమని స్పష్టమవుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను నమ్మకద్రోహం చేసినవాడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి CM Jagan With Union Ministers: జగన్ దిల్లీ టూర్.. ఎవరెవరిని కలిశారంటే..