పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ (ap govt), కేరళ ప్రభుత్వాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వేళ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయినా..రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని..సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ ఎందుకు వేయలేదని జస్టిస్ ఎ.ఎం ఖన్విల్‌కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రెండ్రోజుల్లో అఫిడవిట్ (affidavit) దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా..ఏపీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని సుప్రీంకోర్టు నిలదీసింది.
11వ తరగతి పరీక్షలు (exams) సెప్టెంబరులో జరుపుతామని విచారణ సందర్భంగా కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏపీ నుంచి స్పష్టత లేదని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ..ఆగస్టు, సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ సిద్దంగా ఉందని తెలిపింది. ఆ విషయాన్ని ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ..ఆగస్టు, సెప్టెంబర్‌లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ హెచ్చరించారని..ఆ సమయంలో ఎలా నిర్వహిస్తారని నిలదీశారు.
రేపు సాయంత్రంలోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసం..విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదే సందర్భంలో పరీక్షల రద్దును సవాలు చేస్తూ..దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. పరీక్షల రద్దు, మార్కుల కేటాయింపు విధానంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ (CBSE), ఐసీఎస్‌ఈ (ICSE) బోర్డులు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి
YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్