Jobs in foreign: విజయవాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాదిలో 789 మందికి 728 మంది ఉత్తీర్ణత సాధించారు. 495 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించగా.. మరో 30 మంది ఎంబీఏ, ఎంటెక్‌కు వెళ్లారు. 11 మంది విదేశాల్లో ఎంఎస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉద్యోగాలు పొందిన 495 మంది టీసీఎస్, విప్రో, డీఎక్స్‌సీ, యాక్సెంచర్, క్యాప్‌జెమినీలాంటి కంపెనీలకు ఎంపికయ్యారు. వీరందరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనే ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. 192 మందికి ఎలాంటి ఉద్యోగాలూ లభించలేదు. ఈ లెక్కన స్థానికంగా ఉపాధి పొందిన వారు ఒక్కరూ లేరు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ ఇదే తీరు.
డిగ్రీ పట్టాలతో తరలిపోతున్న యువత.. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగేళ్ల సరాసరిన 91,000 మంది బీటెక్‌లో చేరుతుండగా.. డిగ్రీలో 2.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో 65%-70% మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఏటా 2.40 లక్షల మంది కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2021-22లో 69,700 మంది ప్రాంగణ నియామకాలు పొందారు. ఈ ఉద్యోగాలు పొందిన వారిలో 97% మంది ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలకు ఎంపికైనవారే.
ఇక్కడ చదువులు.. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు.. ఇదీ ప్రస్తుతం మన రాష్ట్రం పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు శ్రామికశక్తిని అందించే రాష్ట్రంలా మారిపోతోంది. పెద్ద మెట్రో నగరమంటూ లేకపోవడం.. పెద్ద పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రాకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం వలస వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో పని చేసే మానవ వనరులు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడనుంది. బీటెక్, డిగ్రీ, ఎంటెక్, పీజీలు పూర్తి చేయగానే ఉపాధి కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి నగరాల బాట పడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా 30 శాతం వరకు వలసలు ఉంటాయి. కానీ, 90% - 95% యువత ఇతర ప్రాంతాలకు వెళ్లడం ఎక్కడా ఉండదు. విజయవాడ, విశాఖపట్నంలాంటి చోట్ల కొన్ని ఐటీ పరిశ్రమలున్నా పెద్ద మొత్తం ప్యాకేజీలు, ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. విశాఖపట్నంలో కొన్ని ఫార్మా కంపెనీలు, చిత్తూరు శ్రీసిటీలో కొన్ని పరిశ్రమలు తప్ప రాష్ట్రంలో పెద్దవీ లేవు. డిగ్రీ, బీటెక్ చదువుతున్న వారికి అప్రెంటీస్, ఇంటర్న్‌షిప్ చేసేందుకే పూర్తిస్థాయిలో అవకాశం లభించని దుస్థితి నెలకొంది.
మానవ వనరులు తరలిపోతున్నాయి..
రాష్ట్రంలో పేరున్న ఐటీ పరిశ్రమలేవీ లేవు. విజయవాడలో హెచ్‌సీఎల్ ఉన్నా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్న పరిస్థితి లేదు. విశాఖపట్నంలో కాన్‌డ్యూయెంట్ కొంతవరకు ఉద్యోగాలిస్తోంది. మిగతావి చిన్నపాటి సాఫ్ట్‌వేర్ సంస్థలే. వీటిల్లో పెద్ద మొత్తం వేతన ప్యాకేజీలతో నియామకాలు చేపట్టేవి తక్కువే. గత ప్రభుత్వ హయాంలో పలు రాయితీలు కల్పించి ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. విశాఖకు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ వస్తాయని ప్రకటించినా ఇంతవరకు రాలేదు. ఇంజినీరింగ్ చదివిన యువత అంతా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, పుణెలకు వెళ్లిపోతోంది. సాధారణ డిగ్రీలు పూర్తి చేసిన వారు హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లిపోతున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.
* ఏ రాష్ట్రం తీసుకున్నా వివిధ రంగాలకు సంబంధించినవి 10-15 విశిష్ఠ విద్యా సంస్థలు (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ఉంటాయి. మన రాష్ట్రంలో ఆ స్థాయి విద్యా సంస్థ ఒక్కటీ లేదు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో నిధులు, వనరులు సమకూర్చకపోవడంతో అవి ఇప్పటికీ ఆ స్థాయికి ఎదగలేదు. వాటిలో చదువుకునే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలూ రాష్ట్రానికి రావడం లేదు.
నిర్మాణ రంగంలోనూ ఉపాధి కరవే..
రాష్ట్రంలో నిర్మాణ రంగం దెబ్బతినడంతో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న వారికి ఉద్యోగాలు లభించని పరిస్థితి నెలకొంది. స్థిరాస్తి వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడంతో పెద్దపెద్ద కంపెనీలు నిర్మాణాలు చేపట్టడం లేదు. రాజధాని అమరావతి పనులు సాగే సమయంలో ఆ చుట్టుపక్కల నిర్మాణాలు భారీగా సాగాయి. ఈ సమయంలో ఇంజినీరింగ్ అభ్యర్థులతోపాటు ఇతరులకు స్థానికంగా కొంతవరకు ఉపాధి లభించింది. అమరావతి నిర్మాణాలు నిలిచిపోవడం, స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. కొన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలకు వెళ్లిపోయాయి. చిన్నచిన్న కంపెనీలున్నా వాటిలో ఉపాధి అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. రూ.15 వేలు- రూ.18 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదు.
* పరిశ్రమలు లేకపోవడంతో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న వారికి ఉపాధి దొరకడం లేదు. సివిల్, మెకానికల్ వారు సైతం ఏదో ఒక సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకునేందుకు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు.
విద్యా సంస్థలే అధికం..
* రాష్ట్రంలో విద్యా సంస్థలు అధికంగా ఉన్నందున వాటిలో బోధన, బోధనేతర పోస్టులు కొంతవరకు లభిస్తున్నాయి. కానీ వేతనాలు తక్కువగా ఉండడంతో కొంతమంది యువత వీటిపై ఆసక్తి చూపడం లేదు.
* సాధారణ డిగ్రీలు చేసిన వారికి స్థానికంగా మార్కెటింగ్, హాస్పిటాలిటీ, మాల్స్‌లో సేల్స్ బాయ్స్, ప్రైవేటు బడుల్లో ఉపాధ్యాయులు, అకౌంటెంట్‌లు వంటి తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయి.
* పరిశ్రమలు తక్కువగా ఉండడంతో పాలిటెక్నిక్ పూర్తి చేస్తున్న వారిలో 70% మందికి పైగా బీటెక్‌లో చేరిపోతున్నారు. బీటెక్ చేస్తే బయట ప్రాంతాల్లో కొంచెం మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నత చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
వృద్ధులతో ఆర్థిక వ్యవస్థ కుదేలు..
మొత్తం జనాభాలో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు పిల్లల శాతం దేశం మొత్తం మీద రాష్ట్రంలోనే తక్కువని శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే నివేదిక బహిర్గతం చేసింది. ఉపాధి కోసం యువత తరలిపోయి, వృద్ధులే ఇక్కడ మిగిలితే ఉత్పాదకత తగ్గిపోతుంది. సంపాదించే వాళ్లు లేక, డబ్బు చలామణీ లేక.. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడుతుంది.
* కొత్తతరం ఇక్కడ ఉండకుండా.. ప్రస్తుత తరం క్రమంగా పెద్దలుగా మారిపోతే రాబోయే రోజుల్లో ఊళ్లన్నీ వృద్ధులతోనే నిండి ఉంటాయి. 2030 నుంచే ఈ పరిస్థితి కనిపిస్తుందని, 2050 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుతుందని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.
75% రిజర్వేషన్‌తో ఏం లాభం?
రాష్ట్రంలో ఐటీ, ఇతర పరిశ్రమలు లేకుండా స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాలను తీసుకొస్తే ఏం లాభం? ఉపాధే లేనప్పుడు ఈ రిజర్వేషన్ ఎలా ఉపయోగపడుతుంది? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని పరిశ్రమలు ఏవో చిన్న ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చి, పైస్థాయి ఎక్కువ వేతనాలు ఇచ్చే వాటిని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాయి. శ్రీసిటీలోని కొన్ని సంస్థలు ఇదే పంథాను అనుసరిస్తున్నాయి.
* యువత వలసలు పోతే భవిష్యత్తులో రాష్ట్రానికి ఏ కంపెనీలూ వచ్చే పరిస్థితి ఉండదు. కంపెనీలను పెట్టాలనుకునే యాజమన్యాలు చదువుకున్న వారు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయో, లేవో పరిశీలిస్తాయి. యువత లేకపోతే పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపవు.
దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడాలి
- కోట సాయికృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య
‘‘రాష్ట్ర విభజన తర్వాత ఐటీ, ఇతర పరిశ్రమలు రాకపోవడంతో ఒక తరం నష్టపోతోంది. స్థానికంగా పరిశ్రమలు లేనప్పుడు 75% ఉద్యోగాల రిజర్వేషన్ అమలు చేసినా ఏం లాభం? ప్రభుత్వాలు, ప్రజలు తాత్కాలిక లబ్ధిపై కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టిపెట్టాలి. యువత వలస వెళ్లిపోతే చివరికి వృద్ధులే మిగులుతారు. ఆ తర్వాత పని చేసేవారు లేరని కంపెనీలు రావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది’’