ప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఏబీవీపీ చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 13 జిల్లాల నుంచి వచ్చిన సుమారు 100 మంది అమరావతిలోని సచివాలయం రెండో గేటు వరకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తుళ్లూరు స్టేషన్‌కు తరలించి, తర్వాత విడిచిపెట్టారు. ఏబీవీపీ నాయకులు హరికృష్ణ మాట్లాడుతూ 25 వేల ఉపాధ్యాయ పోస్టులు, 10 వేల కానిస్టేబుల్, ఆరు వేల గ్రూప్ 3, 4 పోస్టులతో కొత్త క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
* విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏపీ ఉద్యోగ పోరాట కమిటీ ఆధ్వర్యంలో తెలుగు యువత, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ సంఘాల నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
* రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల తర్వాత నిరుద్యోగుల నోట్లో గడ్డి పెట్టారంటూ.. బుధవారం విజయవాడ లెనిన్‌కూడలిలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన తెలిపారు.
* అరకొర ఉద్యోగాలు ప్రకటించారంటూ గుంటూరు హిమాని సెంటర్ విగ్రహం వద్ద నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు భిక్షాటన, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
* కొత్త క్యాలెండర్ విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు విజయ్ సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
* కడప అంబేడ్కర్ కూడలిలో డీవైఎఫ్‌ఐ నేతలు మోకాళ్లపై నిల్చుని చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు.
* చిత్తూరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెన్నై-బెంగళూరు హైవేపై ఏబీవీపీ నాయకులు బైఠాయించారు.
* నెల్లూరులోని వీఆర్‌సీ కూడలి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు నిరసన తెలిపారు.
* నిరుద్యోగుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ నాయకులు, కర్నూలు జిల్లా ఆస్పరిలో వామపక్ష పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయనగరంలోని కోట వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు.
2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఆర్థిక శాఖ ప్రకటించిన 2.35 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడ సీపీఎం కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని నాడు జగన్ హామీ ఇచ్చారన్నారు. జగన్ నాడు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడటం, కేసులు పెట్టించడాన్ని ఖండించారు.
ఇదీ చదవండి:
CM JAGAN: తెలంగాణలో మన ప్రజలున్నారు.. సామరస్యంగా పరిష్కరించుకుందాం