అనంతపురంలో...
ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చాార్జి ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. క్వారంటైన్ కేంద్రాల్లోని రోగులను అధ్వాన్నంగా చూస్తున్నారని... వారికి పౌష్ఠికాహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మడకశిరలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి నిరసన చేపట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అత్యవసర సేవలందిస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారికి రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలో...
కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల కంటే ఇంకా ఎక్కువగానే బయటపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ పరీక్షల కోసం ప్రజలు బారులు తీరాల్సిన దయనీయ పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని ఆరోపించారు. కేసులు పెరుగుతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు.
కడపలో...
కరోనాను అరికట్టడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని కడప తెదేపా ఇన్చార్జ్ అమీర్ బాబు అన్నారు. ప్రతి కుటుంబానికి 5వేల రూపాయలు ఇవ్వాలని... ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని డిమాండు చేశారు. చనిపోయిన పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ కార్మికులకు, జర్నలిస్ట్ లకు రూ.50 లక్షలు ఇవ్వాలన్నారు.
ఇదీచదవండి.