విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంటర్ మార్కులు కీలకం. అప్రమత్తతతో 2021 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించండి. లేదంటే కోర్టు ఏది మంచిది అనుకుంటే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయండి.
- సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్
'పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులకు మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తున్నాం. వివిధ పాఠశాలలు నిర్వహించే అంతర్గత పరీక్షలపై నిఘా పెట్టే అధికారం కానీ, వాటిని పర్యవేక్షించే సౌలభ్యం కానీ ఇంటర్మీడియట్ బోర్డుకు లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశపరీక్షల్లో 25% ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుంది. కొవిడ్ కేసులు మే 20న 22,610, 21న 20,937, 22న 19,981 రాగా.. జూన్ 20న 5,646, 21న 5,541, 22న 4,169 వచ్చాయని.. ఇలా కేసులు తగ్గుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించడమే విద్యార్థులకు ప్రయోజనకరమని అధికారులు భావించారు' అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాలు కొవిడ్ నేపథ్యంలో పరీక్షల రద్దుకు మొగ్గు చూపినా ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు మాత్రం వాటి నిర్వహణకే మొగ్గుచూపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ దాఖలుచేయాలని ఆదేశించింది. అందుకు జులై 1 వరకు సమయం అడిగినా ఇవ్వకుండా బుధవారం లోపు దాఖలుచేయాలని ఆదేశించడంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ పేరున రాష్ట్ర ప్రభుత్వం 8 పేజీల అఫిడవిట్ సమర్పించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జాగ్రత్తలతో తలపెట్టిన పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. ఇప్పటికే నిపుణులతో సంప్రదించామని, ప్రస్తుత పరిస్థితులు పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్లు వారు అభిప్రాయపడ్డారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జులై చివరివారంలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. కచ్చితమైన టైంటేబుల్‌ను త్వరలో జారీచేస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీసం 15 రోజుల ముందే ఇది చెబుతామని వెల్లడించింది.
- ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 5,12,959 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,19,510 మంది హాజరుకానున్నారు.
- పరీక్షలు రోజు మార్చి రోజు జరుగుతాయి. ఆర్ట్స్ విద్యార్థులైతే 5, సైన్స్ విద్యార్థులైతే ఆరు సబ్జెక్టుల పరీక్షలకు హాజరుకావాలి. అంటే ఒక్కో సంవత్సరం విద్యార్థి 5, 6 రోజులు మాత్రమే రావాల్సి ఉంటుంది.
- దాదాపు 25్ఠ25 అడుగుల విస్తీర్ణంలో ఉండే పరీక్ష గదిలోకి 15-18 మంది విద్యార్థులనే అనుమతిస్తాం.
- ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 5 అడుగుల దూరం పాటిస్తాం.
- పరీక్ష కేంద్రాలను రోజూ శానిటైజ్ చేయిస్తాం.
- ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు అందుబాటులో ఉంచుతాం.
- పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు టీచర్లు, విద్యార్థులను థర్మల్ స్కానర్‌తో పరీక్షిస్తారు.
- విద్యార్థులకు ఏ గదులను కేటాయించిందీ పలుచోట్ల ప్రదర్శిస్తాం. దానివల్ల పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ తగ్గించడానికి వీలవుతుంది. విద్యార్థులకు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రంలోని సీటు వివరాలు తెలియజేసేందుకు వీలుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ‘నో యువర్ సీట్’ అన్న ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక వైద్యాధికారిని, అవసరమైన మందుల కిట్‌ను ఏర్పాటుచేస్తాం.
- పరీక్ష కేంద్రాల్లో రద్దీని తగ్గించడానికి వీలుగా కేంద్రాల్లోకి విద్యార్థులను చాలా ముందుగానే అనుమతించాలని ఎగ్జామినేషన్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశిస్తాం.
- ప్రతి పరీక్షా కేంద్రానికి ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటుచేస్తాం. దానివల్ల రద్దీని తగ్గించడానికి, భౌతిక దూరం పాటించడానికి వీలవుతుంది.
- సిబ్బంది అందరికీ టీకాలు అందించేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యఆరోగ్య అధికారులను సంప్రదించాలని రీజినల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్లకు సూచించాం.
- పరీక్షల నిర్వహణ, ఎవాల్యుయేషన్ విధుల్లో సుమారు 50 వేల మంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది.
- కొవిడ్ నియంత్రణ కోసం పరీక్ష కేంద్రాల్లో ప్రామాణిక నిర్వహణ నిబంధనలను అనుసరించాలని సిబ్బందికి ఆదేశాలిస్తాం.
ఇదీ చదవండి: