Ramanuja Sahasrabdi Utsav 2022 : సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ వేడుకలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉత్సవాలను అష్టాక్షరీ మంత్రం అహవనంతో ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి.... జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో భగవద్గీతలోని ఆరో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పిన సారాన్ని సమగ్రంగా యాగశాలకు వచ్చిన భక్తులకు వివరించారు. లక్ష్మినారాయణ సహస్ర కుండల మహా యాగాన్ని అన్ని యాగశాలలకు వెళ్లి భక్తులు వీక్షించవచ్చని సూచించారు. అహోబిలం జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఇష్టి మండపంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం పరమేష్టి, పితృదేవల విఘ్నాల నివారణ కోసం వైభవేష్టి హోమాలు నిర్వహించారు. ప్రవచన మండపంలో సుమారు 300 మంది భక్తులతో చిన్నజీయర్ స్వామి శ్రీరామ అష్టోత్తర నామ పూజ చేశారు.
సందడిగా ముచ్చింతల్ పరిసరాలు..
మరోవైపు వారాంతం కావడంతో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తుల రాకతో ముచ్చింతల్ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం సాయంత్రం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.
ఇవాళ సీజేఐ సందర్శన..
CJI to Visit Statue Of Equality : సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేలాది మంది రుత్వికుల యాగం, భక్తుల నమో నారాయణ మంత్ర పారాయణం.. ప్రముఖుల రాకతో ముచ్చింతల్లోని శ్రీరామనగరం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ వేడుకల్లో అత్యంత కీలకఘట్టమైన భారీ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం లాంఛనంగా ఆవిష్కరించారు. అంతకుముందు ఉత్సవాల్లో భాగంగా అష్టాక్షరీ మహా మంత్ర జపంతో ప్రారంభించారు. త్రిదండి చినజీయర్ స్వామితోపాటు 9 మంది జీయర్ స్వాముల సమక్షంలో 5 వేల మంది రుత్వికులు, వందలాది మంది భక్తులు అష్టాక్షరీ మంత్రాన్ని జపించారు. ఈ సందర్భంగా అష్టాక్షరీ మంత్ర ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు.
ఇదీ చదవండి: