ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు నిమ్మగడ్డ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
విశాఖ జిల్లా...
జిల్లాలో 344 పంచాయతీల్లో నిర్వహించే తొలి దశ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వినయ్‌చంద్ స్పష్టం చేశారు. ఇందుకు 9వేల 608 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటిదశలో ఈ నెల 29 నుంచి 31వరకు నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా...
పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్దమైంది. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహిస్తామని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమన్వయం చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
అనంతపురం జిల్లా...
పంచాయతీ ఎన్నికలకు సర్వసన్నద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి సామగ్రిని సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, ఎక్కడిక్కడ ఇప్పటికే ఆదేశాలిచ్చామని ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు.
విజయనగరం జిల్లా...
విజయనగరం రెవెన్యూ డివిజన్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని ఎన్నికల కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ విజ్ఞప్తి చేశారు. అధికారుల ప్రతిపాదనకు ఈసీ సుముఖత వ్యక్తం చేశారు. డివిజన్లో 19 మండలాలకు మూడో విడత కింద ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మూడో విడతలో 10మండలాలు, నాలుగు విడతలో 9మండలాల్లో ఎన్నికల నిర్వహణను ఈసీ పరిశీలిస్తామన్నారు.
కడప జిల్లా...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ గడువు సమీపిస్తున్న తరుణంలో... జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలపై ఎస్ఈసీ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సిబ్బంది, నిధుల సమస్య, ఓటర్ల జాబితాపై చర్చించారు. ఏకగ్రీవాలపై కాకుండా కచ్చితంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: ఎస్ఈసీ