పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు సహా బడ్జెట్ కేటాయింపులపై చర్చించేందుకు.. రాష్ట్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా నేడు సమావేశం కానున్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోని పార్లమెంట్ సభ్యులు వారి ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు సహా బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకుని రావచ్చని రైల్వే అధికారులు ఆహ్వానాలు పంపారు.
రైల్వే వ్యవస్థను ఆధునికీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైల్వే బడ్జెట్లో కేటాయించిన నిధులు వ్యయం సహా... వచ్చే బడ్జెట్లో ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కావాలో ప్రతిపాదనలను ఎంపీలు తెలియజేయనున్నారు. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, పలు స్టేషన్ల గ్రేడింగ్ పెంపు, పలు మార్గాల్లో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, విద్యుదీకరణ ,కొత్త రైళ్లు నడపడం సహా కొత్తగా రైళ్ల స్టాపులు ఏర్పాటు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన తదితర అంశాలపై జీఎంతో ఎంపీలు చర్చించనున్నారు. సమావేశంలో ఎంపీల ఇచ్చిన ప్రతిపాదనలన్నింటినీ క్రోడీకరించిన అనంతరం దక్షిణ మధ్య రైల్వే సమగ్ర ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపనుంది.
ఇదీచదవండి.