Sankranti celebrations: మన తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండగ. పేరుకు నాలుగు రోజుల పండగే! కానీ మనకి నెలరోజుల ముందే మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభం నుంచి నెలపట్టటంతో మన సంబరాలు ప్రారంభమవుతాయి. ఇంటి ముందు కళ్లాపి జల్లి, పెద్దపెద్ద ముగ్గులు వేయడం, వాటిలో గొబ్బెమ్మలు పెట్టడం - ఇంటి ముందుకొచ్చే గంగిరెద్దులని, హరిదాసులని ఆదరించడం - ఇవన్నీ మనం చేసేవే. ఇంటిని శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం, గుమ్మాలకి పసుపు రంగు పూయడం వంటివన్నీ ఆడపడుచులు తమ అధికారంలా భావించేస్తారు. ఇంకా పిండి వంటలు, బొమ్మల కొలువు, పేరంటం చేసి పసుపు కుంకాలు పంపకం.. ఎన్ని చేస్తాం! ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా.. సంక్రాంతి పండగని మాత్రం వీలైనంత వేడుకగా జరిపే ప్రయత్నం చేస్తుంటాం. బొమ్మల కొలువు, భోగిపళ్లు, పేరంటం వంటివీ కొనసాగిస్తున్నాం. రంగవల్లులు తీర్చిదిద్దడంలో, బొమ్మలను కొలువు దీర్చడంలో మన సృజనాత్మకత, ఆదరించడం ద్వారా ఇతరులకు సాయం చేయడం, సహానుభూతి, పేరంటంలో అందరినీ కలిపేసుకునే తత్వం.. ఎంత గొప్ప నైపుణ్యాలో గమనించారా!
అనుబంధాల తోరణాలు
అందరి కంటే కొత్తగా, భిన్నంగా ప్రయత్నించాలనే పోటీతత్వం ముగ్గుల విషయంలో కనిపిస్తుంటుంది. కొత్త ఆలోచనలు, మనసులోని భావాలు బొమ్మల కొలువు ద్వారా వ్యక్తమవుతుంటాయి. అందరూ చేరిన సమయంలో చిన్నప్పటి ఆటలు, అలనాటి సంగతులు గుర్తు చేసుకుంటోంటే.. ఒత్తిడీ దూరం. ఇక పేరంటంలో ఇచ్చే తాంబూలం ద్వారా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శితమవుతుంది. ఈ రూపంలో ఇరుగు పొరుగుతో సత్సంబంధాలూ పెరుగుతాయి. నెట్‌వర్కింగ్ స్కిల్స్ అంటాం కదా!
పౌష్యలక్ష్ములం
పెద్ద పండగ కాబట్టి కొత్త బట్టలు తప్పనిసరి. వ్యవసాయ కుటుంబాల వారు ఏదైనా నగ చేయించుకుంటారు. పంటలు చేతికి వచ్చి ఉంటాయి. కనుక ఎంత చిన్న రైతుకి అయినా లేదు అనుకునే పరిస్థితి ఉండదు. తరతరాలుగా కొనసాగుతుండటంతో నగరంలో ఉంటున్నా ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ చాలామంది కొనసాగిస్తున్నారు. ప్రపంచం ఎంత వేగంగా పరుగెడుతోన్నా ఆడపడుచుల్ని పిలిచి పసుపు కుంకాలు ఇచ్చి పంపడం కొనసాగుతూనే ఉంది కదా! కొత్తగా అమ్మాయి పెళ్లి అయితే ఇక ఆ సంబరమే వేరు. ఇక్కడా కలుపుగోలు తత్వాన్ని ప్రదర్శిస్తాం. ఎవరికి ఎంతలో పెట్టాలో అన్నీ చూసుకునేది మనమే. ఆర్థిక నిర్వహణ అన్నమాట! ఇంకా.. ప్రకృతి అంతా పచ్చగా, ప్రకృతి స్వరూపిణులైన వనితలందరూ దానినే ప్రతిబింబిస్తున్నట్టు కళకళ లాడుతూ కనపడతారు. అసలు ఈ పండగనాడు పూజించేది పౌష్యలక్ష్మిని. అంటే మన ప్రతి రూపమే.
తరాల వారధులం
ఖగోళంలో జరిగే గ్రహ గోళాల విన్యాసాలే ఇంటి ముందు వేసే ముగ్గులు. ప్రత్యేకంగా సంక్రాంతి సమయంలో ఈ సమయానికి సంబంధించినవే ముగ్గుల రూపంలో వేస్తారు. వాటితో పాటు పౌరాణిక గాథలు, చారిత్రకాంశాలకీ వీటిలో చోటిస్తారు. ఉదాహరణకి వైకుంఠ ఏకాదశికి స్వర్గ ద్వారాలు తెరుచుకున్నట్టు, ముందు రోజు మూసి ఉన్నట్టు వేస్తారు. సంక్రమణం రోజు రథం ఇంటిలోకి వస్తున్నట్టు, కనుమ నాడు బయటికి వెళుతున్నట్టు ముగ్గు వేస్తారు. ఇది విజ్ఞానాన్ని తరువాతి తరాలకి అందించే ప్రయత్నం. ఇవన్నీ చేసేది ఎవరు? గృహ సామ్రాజ్య మహారాణులే. ఒక సంప్రదాయం కొనసాగి తరువాతి తరాల వారికి అందడానికి మహిళామణులే అంటే.. మనమేగా కారణం. ఈ పండగ ద్వారా మనకొస్తున్న బాధ్యతను సక్రమంగా నిర్వహిద్దామా మరి!
ఇవీచదవండి.