RTC-EHS CARDS: ఆర్టీసీ ఉద్యోగులు గతంలో మాదిరిగా సంస్థ ద్వారా వైద్యసేవలు పొందాలనుకుంటే ఒక్కో ఉద్యోగి నెలకు ప్రీమియం కింద రూ.544 వరకు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద వైద్యసేవలు వద్దని, పాత విధానంలో ఆర్టీసీ ద్వారా వైద్యం పొందే వీలుకల్పించాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈహెచ్‌ఎస్ రద్దు చేసి, ఆర్టీసీ వైద్యం కావాలనుకుంటే ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుందని అధికారులు వివరించినట్లు సమాచారం. ప్రీమియం కింద వైద్యసేవలకు రూ.544 చొప్పున ప్రతి నెలా ప్రీమియంగా చెల్లిస్తే పాత విధానం అమలుకు వీలుంటుందని పేర్కొన్నారు. దీనిపై సంఘాల అభిప్రాయాలు కోరినట్లు సమాచారం.
వైద్యం కోసం ప్రభుత్వం జారీ చేసిన ఈహెచ్‌ఎస్ కార్డులపై ఆర్టీసీ ఉద్యోగులు వరుస ఫిర్యాదులు చేయడంతో.. పరిష్కారంపై యాజమాన్యం దృష్టి సారించింది. ఈహెచ్‌ఎస్ కార్డులతో సరిగ్గా వైద్యం అందడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యానికి..ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. పరిష్కారాన్ని చర్చించేందుకు విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, కార్మిక పరిషత్, తదితర ఉద్యోగ సంఘాలతో.. సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు సమావేశమయ్యారు. ఈహెచ్‌ఎస్ వల్ల పడుతున్న కష్టాలను ఎండీ దృష్టికి తెచ్చారు. వైద్యం కోసం గతంలో ఆర్టీసీలో ఉన్న పాత విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. గతంలో తరహాలో ఆర్టీసీ ద్వారా సొంత ఆస్పత్రులు, రిఫరల్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు అపరిమిత వైద్యం అందించాలని కోరారు. ఉద్యోగుల ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎండీ తెలిపారు. అపరిమిత ఉచిత వైద్యం కోసం సరికొత్త పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని ఎండీ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: డబ్బులిచ్చినా పోలవరం కట్టలేకపోయారేం?: కేంద్రమంత్రి నారాయణస్వామి