Cheddi Gang in AP: సీఎం జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలోని రెయిన్‌బో విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి యత్నించింది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు ఓ వ్యాపారికి సంబంధించిన విల్లాల తలుపుల్ని పగులకొట్టి లోపలికి చొరబడింది. డబ్బు, ఆభరణాల కోసం వెతుకుతూ విల్లాల లోపల ఉన్న వస్తువుల్ని చిందరవందర చేసింది. విలువైనవేవీ లభించకపోవటంతో ముఠా వెనుదిరిగింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాడేపల్లి నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాల్లోకి ఈ నెల 3న అర్ధరాత్రి దాటాక చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా భావిస్తున్న ఐదుగురు ప్రవేశించారు. వీరంతా చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. వెంట తెచ్చుకున్న గడ్డ పలుగులతో తలుపులు పగలగొట్టి.. 37, 39, 44 నంబరు విల్లాల్లోకి చొరబడ్డారు.
అయితే ఆ విల్లాల్లో విలువైనవేమీ పోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సోమవారం వరకూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు చోరీని గుర్తించారు. 2వ తేదీన ఇదే ముఠా కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడి రూ.4 వేలు దోచుకున్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ బయటపెట్టలేదు. ఈ నెల 1న అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. ఆ ముఠాలోనూ ఐదుగురు సభ్యులున్నారు. మరుసటి రోజు ఈ విషయం వెలుగుచూసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై, తనిఖీలు, నిఘా, గస్తీ ముమ్మరం చేసుంటే 3న నవోదయ కాలనీలో చోరీ యత్నానికి అవకాశం ఉండేది కాదు. సీఎం, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నివాసం ఉండే హైసెక్యూరిటీ జోన్‌లోనే నిఘా, భద్రత డొల్లగా ఉండటం పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవోదయ కాలనీ పరిసరాల్లోని పలు అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో నివాసం ఉంటున్నారు. కొందరు వాటిని క్యాంపు కార్యాలయాలు, అతిథిగృహాలుగా వినియోగించుకుంటున్నారు. ఈ ప్రాంతంలోకి ముఠా ప్రవేశించటం కలకలం రేపింది. ‘రెయిన్‌బో విల్లాలో చోరీకి యత్నించింది చెడ్డీ గ్యాంగేనా? వేరే ముఠానా? అనే అంశాన్ని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. గుంటుపల్లిలో... రెయిన్‌బో విల్లాల్లో చోరీకి యత్నించింది ఒక ముఠానేనా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నాం’ అని గుంటూరు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ తెలిపారు.
దొంగలు సెల్‌ఫోన్ ఏమైనా వాడారా అనే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గుంటుపల్లిలోని సెల్‌టవర్ డంప్‌ను విశ్లేషిస్తున్నారు. తాజాగా.. తాడేపల్లి పోలీసుల నుంచి అక్కడి డంప్‌నూ తీసుకున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఏమైనా కాల్స్ వెళ్లాయా? ఏయే నెంబర్ల నుంచి ఎక్కడికి వెళ్లాయన్నది క్షుణ్ణంగా అన్వేషిస్తున్నారు.
ఇదీ చదవండి:
CHILD PORN VIDEOS SELLER: చిన్నారుల నీలిచిత్రాలను విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్