ఈ-కేవైసీ చేయించుకున్న వారికే అక్టోబరు నుంచి రేషన్ ఇస్తారు. నమోదు చేయించుకోకుంటే ఇవ్వరు. అయిదు నుంచి 15 ఏళ్ల లోపు వారికి మాత్రం నెలాఖరు వరకు గడువు పొడిగింపు ఇచ్చినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-కేవైసీ లేని వారికి రేషన్ నిలిపేసినా.. నమోదు చేయించుకుని వస్తే వెంటనే ఇస్తామని పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం కార్డులోని ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. అయిదేళ్ల లోపు వారికి అవసరం లేదు. వాలంటీర్ దగ్గరుండే మొబైల్ యాప్ ద్వారా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు’ అని తెలిపారు. ‘ఒక కార్డులో నలుగురు సభ్యులుండి.. ముగ్గురికి ఈ-కేవైసీ అయి ఉంటే వారికే రేషన్ ఇస్తారు.
ఈ-కేవైసీ పూర్తి చేయించుకున్నాకే నాలుగో సభ్యుడికి ఇదే నెలలో రేషన్ ఇస్తారు’ అని వివరించారు. ‘వేలిముద్రలు సరిగా పడని కూలి పనులు చేసేవారు, వృద్ధులకు.. చౌక దుకాణంలోని ఈ-పోస్ యంత్రంలో ఫ్యూజన్ ఫింగర్ అవకాశాన్ని వినియోగించుకుని ఈ-కేవైసీ నమోదు చేయించుకోవచ్చు. కుష్ఠువ్యాధి వారికి వీఆర్వో ద్వారా, ఒంటరి కార్డుదారులకు వాలంటీర్ ద్వారా గతంలో తీరునే రేషన్ తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: