RAINS IN AP: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వానలతో కృష్ణా, గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలోనూ మూడు రోజులుగా ముసురుపట్టి ఈదురుగాలులు హోరెత్తిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి అధికశాతం మండలాల్లో ఎడతెరపి లేకుండా తుంపర చినుకులు పడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం.. మంగళ, బుధవారాల్లో బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం సూచించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలప్రభావం మరింత పెరగనుంది.
పెరుగుతున్న వరదపోటు
గోదావరికి వరద పెరగడంతో సోమవారం రాత్రి 10 గంటలకు ధవళేశ్వరం వద్ద 9.21 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇది రాత్రి పది లక్షల క్యూసెక్కులకు పైగా చేరే అవకాశముంది. గతేడాది సెప్టెంబరు 16న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు జులైలోనే ఆ స్థాయిలో వరదలు వచ్చాయి. తెలంగాణ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజి ప్రవాహం పెరిగింది. దీంతో వరదను దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
* దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఏర్పడిన అల్పపీడనం.. మంగళ, బుధవారాల్లో మరింత బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో మంగళవారం ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటినుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వివరించారు.
* ఒడిశా తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
* సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 57.5, చింతూరు మండలం ఎర్రంపేటలో 50 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటలనుంచి సోమవారం ఉదయం 8.30 గంటల మధ్య చింతూరు మండలం ఎర్రంపేటలో 109.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
గోదావరి ఉగ్రరూపం
దేవీపట్నం వద్ద ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం ఏడింటి వరకు దాదాపు 12 అడుగుల మేర నీటిమట్టం పెరగడంతో గోదావరి పరీవాహక గ్రామాలు నీటమునిగాయి. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద నది పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన వరరామచంద్రపురం, కూనవరం, చింతూరు, ఎటపాక ప్రధాన రహదారులపైకి భారీగా వరద చేరింది. ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం సరిహద్దులో ప్రధాన రహదారిపై వరద చేరడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచాయి. రాయనపేట జాతీయ రహదారిపై చింతూరు, రాజమహేంద్రవరం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలకు రాకపోకలు స్తంభించాయి. చింతూరు మండలం నిమ్మలగూడెం-కుయుగూరు గ్రామాల మధ్య కి.మీ.మేర జాతీయ రహదారిపై వరద చేరుకుంది.
* కుకునూరు వద్ద గోదావరికి వరద పోటెత్తుతూనే ఉంది. సోమవారం సాయంత్రం ఆరింటికి 53.40 అడుగుల స్థాయిలో వరద ప్రవహిస్తోంది. వరద 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో (చివరి) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం కొంత సానుకూలంగా కనిపిస్తోంది. వరద ప్రభావముండే గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను దాచారంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. వరద పెరిగితే గుట్టలపైకి చేరుకునేందుకు లచ్చిగూడెం గ్రామస్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. సీతారామనగరానికి వెళ్లే రహదారి నీట మునిగింది. కుక్కునూరు-దాచారం గ్రామాల మధ్య గుండేటివాగు వంతెన మీదుగా వరద కుక్కునూరు వైపు వచ్చింది.
* భద్రాచలం వద్ద 13 గంటల్లో వరద 3 ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తోంది. 1986 తర్వాత ఇంత వేగంగా మూడు హెచ్చరికలు దాటడం ఇదే తొలిసారి.
నారాయణపుర నుంచి నీటి విడుదల
రాయచూరు, న్యూస్‌టుడే: ఆలమట్టి నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభమవడంతో సోమవారం సాయంత్రం నారాయణపుర జలాశయంనుంచి జూరాలకు నీటిని వదులుతున్నారు. సాయంత్రం 6.30 గంటలకు నదిలోకి 22,800 క్యూసెక్కులను వదిలారు.
ఇవీ చదవండి: