రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పార్లమెంట్ కమిటి అధ్యక్షుడు కాకు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఏపీబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు. రైతులతో చర్చలు జరిపి వాళ్ల సూచనలను పరిగణాలోకి తీసుకోవాలన్నారు. 22 రోజులుగా వేలాది మంది రైతులు చలిని సైతం లెక్క చేయకుండా నిరసనలు చేస్తున్నారని... రైతులకు నచ్చజెప్పలేనప్పుడు ఆ చట్టాలను రద్దు చేయాలన్నారు.
అనంతపురం జిల్లాలో..
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులో డీవైఎఫ్ఐ నాయకులు వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు ఎద్దుల బండిని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షా ముఖచిత్రాలు ధరించి కేంద్రం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికే ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు.
ప్రకాశం జిల్లాలో..
దిల్లీలో అన్నదాతలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రకాశం జిల్లా చీరాలలో బీసీ ఫెడరేషన్, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 22 రోజులుగా రైతులు పొరాటం చేస్తుంటే కేంద్రంలో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.