'కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు' ఉంది వెబ్‌ల్యాండ్ పరిస్థితి. మ్యుటేషన్ దరఖాస్తు పరిష్కార విధానంలో ఇటీవల తప్పనిసరి చేసిన ఓటీపీ విధానం, అడంగల్, 1బిలో మార్పుచేర్పులు చేసుకోవాలన్నా, యాజమాన్య హక్కులను వారసులకు మార్చుకోవాలన్నా వెబ్‌ల్యాండ్ సహకరించకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక, బ్యాంకుల్లో భూములు తనఖా పెట్టుకోలేక, అవసరమైనప్పుడు అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆటోమ్యుటేషన్ జరిగే విధానం గతేడాది ప్రవేశపెట్టినా ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తప్పనిసరిగా గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తుంటే చాలా సమస్యలు వస్తున్నాయి.
మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేస్తే భూయజమాని బయోమెట్రిక్‌ను కంప్యూటర్ అడిగేది. యజమాని లేకపోతే అతని నంబరును వారి తరఫు వ్యక్తి దరఖాస్తులో నమోదు చేస్తారు. వెంటనే భూయజమాని సెల్‌నంబరుకు ఓటీపీ వెళ్తుంది. అది నమోదు చేస్తేనే కంప్యూటర్‌లో వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి, ఓటీపీని తప్పనిసరి చేయడం కొత్త సమస్యకు దారితీసింది. చాలామంది రైతుల ఆధార్‌కు సెల్ నంబరు అనుసంధానం కాలేదు. ఆధార్ నమోదు సమయంలో ఎవరి ఫోన్ నంబరు ఇచ్చారో కూడా చాలామందికి గుర్తే లేదు. దీంతో ఓటీపీ రాక దరఖాస్తులు పరిష్కారానికి నోచడం లేదు. ఆధార్‌కు సెల్‌నంబర్ అనుసంధానం చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతుండటంతో విపరీతమైన కాలయాపన జరుగుతోంది.
విస్తీర్ణాల వ్యత్యాసాల ఆప్షన్ తొలగింపుతో..: అడంగల్‌లో పేర్లు, విస్తీర్ణంలో వ్యత్యాసాలను సవరించుకునేందుకు తగిన ఆధారాలతో దరఖాస్తులు చేస్తున్నా.. త్వరగా పరిష్కారం కావడం లేదు. వెబ్‌ల్యాండ్‌లో వివరాల నమోదు సమయంలో ఇంటి పేర్లు, తండ్రి/భర్త/తల్లి, ఇతర పేర్లు, విస్తీర్ణం నమోదులో చాలా తప్పులు జరిగాయి. పేర్ల నమోదులో తప్పుల సవరణ కొంత బాగానే సాగుతోంది. విస్తీర్ణంలో వ్యత్యాసాల సవరణకు వెబ్‌ల్యాండ్‌లో వెసులుబాటును తొలగించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదని...: వారసత్వ ఆస్తుల పంపిణీకి సంబంధించిన డాక్యుమెంట్ల ఆధారంగా మ్యుటేషన్లు జరగడంలోనూ ఇబ్బందులు వస్తున్నాయి. ఓ తండ్రి తన ఆరెకరాలను ముగ్గురు కుమారులకు పంచారు. పార్టిషన్ ఆధారంగా వీరు పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారు. వీరి నుంచి గిఫ్ట్ డీడ్‌గా భూమి పొందిన కుటుంబసభ్యులు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారు. ‘మీతండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ వివరాలు కంప్యూటరులో కనిపించనందున మ్యుటేషన్ జరగదు’ అని సచివాలయ సిబ్బంది తేల్చిచెప్పారు.
2018 ముందు రిజిస్ట్రేషన్ వివరాలు కనిపించడం లేదని...: 2018 ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు మ్యుటేషన్ కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ వివరాలు కనిపించడం లేదని, ఆధార్ నంబరు నమోదు కాలేదంటూ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ప్రతి రైతుకు ఖాతా నంబరు కేటాయించి, దీని ఆధారంగా భూముల వివరాలు(1బి) నమోదు చేస్తారు. సంబంధిత రైతు ఆనాడు తగిన ఆధారాలు చూపించకపోవడం, అనుమానాల నివృత్తి జరగకపోతే తాత్కాలికంగా నోషనల్ ఖాతా నంబరు ఇచ్చారు. ఆ భూములు కొన్న వ్యక్తులు ఇప్పుడు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. కంప్యూటర్‌లో వివరాల నమోదుకు సాధ్యపడడం లేదు. ఈ సమస్యలు పరిష్కరించాలని వీఆర్వోల అసోసియేషన్ భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.
ఇవీ చూడండి