Private Jets On Rent : కొవిడ్ తర్వాత ప్రైవేటు జెట్స్ కార్యకలాపాలు హైదరాబాద్‌లో పెరిగాయి. ఒకప్పుడు సొంతంగా ప్రైవేటు జెట్స్/చార్టర్ ఫ్లైట్స్ కల్గిన వ్యాపారవేత్తలే ఎక్కువగా వీటిలో వెళ్లేవారు. అద్దెకు ప్రైవేటు జెట్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక మార్కెట్ ముఖచిత్రం మారింది. ప్రముఖుల ఇంట్లో ఒకేసారి నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా దూరప్రాంతం వెళ్లాలంటే అద్దె విమానాన్నే బుక్ చేస్తున్నారు. భద్రత, విలాసవంతం, సౌకర్యాల కలయికగా చార్టర్ ఫ్లైట్స్ ఉండటంతో ప్రముఖులు ఖర్చుకు వెనకాడటం లేదు.
Private Jets Price : చార్టర్ ఫ్లైట్స్ (నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్లు)కు బేగంపేట విమానాశ్రయం అనువుగా మారింది.రోజు ఇక్కడి నుంచి 8-10 వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ముంబయి, దిల్లీకి ఎక్కువగా వెళుతున్నారు. బేగంపేట విమానాశ్రయ రన్‌వే ఖాళీగా ఉండడంతో ప్రైవేటు జెట్స్ సందడి చేస్తున్నాయి. భద్రతా తనిఖీలూ నిమిషాల్లోనే అయిపోతాయి. పైగా నగరం నడిబొడ్డున ఉండటంతో సమయమూ కలిసొస్తోంది. దిల్లీ, ముంబయి వంటిచోట్ల వీటికోసం ప్రత్యేక టర్మినళ్లున్నాయి.
6 సీట్లకే ప్రాధాన్యం.. పార్కింగ్, ల్యాండింగ్ ఛార్జీలు అదనం
Charter Flights Price : ప్రైవేట్ జెట్‌లు 6-13 సీట్ల సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. డిమాండ్ కూడా ఎక్కువే. పిలాటస్, కింగ్ ఎయిర్ సి-90, ప్రీమియర్-1ఏ, పాల్కన్ 2000 ప్రైవేట్ జెట్స్ గంటకు కనీసం రూ.లక్షన్నర నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హెలికాప్టర్ సేవలకు గంటకు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. కనీసం 2 వారాల ముందు బుక్ చేసుకుంటే రాయితీ ఇస్తారు. స్తోమత కల్గినవారు సొంతంగా జెట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవసరమైనప్పుడు వాడుకుని మిగతా సమయంలో అద్దెకిస్తున్నారు. ల్యాండింగ్ ఛార్జీ రూ.5 వేల వరకు, రోజంతా నిలిపితే బేగంపేట విమానాశ్రయంలో రూ.500 పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
ఎవరెవరంటే..
- హీరో అల్లు అర్జున్, మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి చార్టర్ ఫ్లైట్‌లోనే ఈ మధ్య ఒక వేడుకకు హాజరయ్యారు. నాగార్జున కుటుంబం సైతం విహారానికి చార్టర్ ఫ్లైట్లోనే వెళ్లి వస్తున్నారు. సినిమా ప్రమోషన్ల సందర్భంలోనూ చిత్ర బృందం ప్రైవేటు జెట్స్‌ను తరచూ వినియోగిస్తున్నారు. రాంచరణ్‌కైతే విమానయాన సంస్థలో భాగస్వామ్యమే ఉంది.
- సభలు, సమావేశాలకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చార్టర్ ఫ్లైట్‌నే వినియోగిస్తున్నారు.
- ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వారి సొంత చార్టర్ ఫ్లైట్‌లోనే వస్తుంటారు.
ఇదీ చదవండి :
ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్