విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువన పులిచింతల నుంచే కాకుండా మున్నేరు, తదితర నదుల నుంచి వరద నీరు భారీగా వస్తోంది. అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 2 లక్షల 99 వేల 440 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 72 గేట్లను పూర్తిగా పైకెత్తి వరద నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి 4 లక్షల 32 వేల 26 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోండగా... నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల 70 వేల 958 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 3 లక్షల 41 వేల 344 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను విజయవాడలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాణిగారి తోట, రణదీర్ నగర్, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు, తదితర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బ్యారేజీ వద్ద ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకిచేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
సోమశిలకు భారీగా వరద...
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి ఆదివారం 20 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి సామర్దం 78 టీెఎంసీలు. జలాశయానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా నదీ జలాలు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న కృష్ణా నదీ జలాలతో సోమశిల జలాశయంతోపాటు కండలేరు జలాశయం కూడా నింపాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: