Polycet: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఈనెల 29న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరగనున్నట్లు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పాలిసెట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్ధుల సంఖ్య పెరిగిందని తెలిపారు. 2020లో 88,484 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా... 2021లో 74,884 మంది... ఈ ఏడాది 1,37,371 మంది విద్యార్ధులు దరఖాస్తు చేశారని వివరించారు. మొత్తం 404 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. 120 మార్కులకు పరీక్ష ఉంటుందని.. 30 మార్కులు సాధించిన బీసీ, ఓసీలకు ర్యాంకులు ఇస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు వస్తాయన్నారు. ప్రవేశ పరీక్ష కోసం ఉదయం 10 గంటల నుంచి అభ్యర్ధులను కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 11 గంటల నుంచి ఎవరికీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 బ్రాంచిలలో మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుకు మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో రూ.4,700, ప్రైవేటు పాలిటెక్నిక్‌లో 25 వేల రూపాయలు ఫీజులుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను పది రోజుల్లో ప్రకటిస్తామని పోలా భాస్కర్ తెలిపారు.
ఇవీ చదవండి :