తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఎస్సీ హక్కుల సాధన ప్రతిఘటన ర్యాలీకి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ జింఖానా గ్రౌండ్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించాలని తెదేపా నేతలు నిర్ణయించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును నిరసిస్తూ ప్రతిఘటన ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ముందుగా జింఖానా గ్రౌండ్స్‌లోని మున్సిపల్ కల్యాణ మండపంలో ఎస్సీ నేతలు సమావేశమయ్యారు. అక్కడికి భారీగా పోలీసులు చేరుకోవటంతో.. కల్యాణ మండపానికి తాళం వేసి.. మండపం పైకి ఎక్కి నేతలు నిరసన చేపట్టారు.
మూడు గంటలుగా నిరసన కొనసాగించారు. నేతలతో పోలీసులు మూడు సార్లు చర్చలు జరిపారు. ర్యాలీకి అనుమతి ఇస్తే కిందకి దిగుతామని వారు తేల్చి చెప్పారు. నిరసన సమయంలో ఓ తెదేపా నేత కళ్లు తిరిగి పడిపోయారు. అతనిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గృహ నిర్బంధం చేశారు. ఎస్సీ నాయకులను పరామర్శించడానికీ పోలీసులు అనుమతించలేదు. ఎస్సీ హక్కుల సాధన ప్రతిఘటన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంపై ఎస్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఎస్సీలపై ధమనకాండ కొనసాగించటం ఆపాలని మాజీ మంత్రి జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు శూన్యమని ఆరోపించారు. అంబేడ్కర్ విదేశీ విద్య ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీల హక్కులను కాలరాయటమే సీఎం జగన్ ఎజెండాగా మారిందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: