విజయవాడ యువతి దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో పలు అంశాలను గుర్తించారు. ఘటనకు కొద్దిసేపటి ముందు తన స్నేహితుడికి నిందితుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని కూడా విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నట్టు సమాచారం. హత్య జరిగే ముందు తనకు నాగేంద్ర ఫోన్ చేశాడని... కాసేపటిలో దివ్య తేజస్విని ఇంటి దగ్గరకు రావాలని తెలిపినట్లు అతను పోలీసులకు తెలిపాడు. అయితే తాను వచ్చేసరికే గాయపడిన దివ్యను ఆసుపత్రికి తరలించేందుకు కిందకు తీసుకు వస్తున్నారని... లోపలికి వెళ్లి చూస్తే నాగేంద్ర కూడా రక్తపు మడుగులో ఉన్నాడని అతను పోలీసులకు చెప్పాడు.
దీనితో పాటు తేజస్విని ఇంటికి కాస్త దూరంలో నిందితుడు ద్విచక్ర వాహనాన్ని నిలిపి కొంతదూరం నడుచుకుంటూ వెళ్లినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ కేసును దిశ పోలీసు స్టేషన్‌కు తరలించటంతో అక్కడి అధికారులు... ఈ కేసుతో సంబంధమున్న వారిని మళ్లీ విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించటంతో దానికి అనుగుణంగా అధికారులు శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే హత్యకు సంబంధించి ఇంకా ఎన్నో చిక్కుముళ్లు వీడలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి