ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకటసురేశ్పై స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అతనికి డబ్బులిచ్చినట్లు అనిశా ఆధికారుల దర్యాప్తులో ఔషధ సరఫరాదారులు వాంగ్మూలం ఇచ్చారని గుర్తుచేసింది . ఈ కేసులో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, పిటిషనర్‌కు ముందస్తు బెయిలిస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే అనిశా వాదనలను తోసిపుచ్చలేమని పేర్కొంది.
సామాజిక - ఆర్థిక నేరాలు.. దేశ ఆర్థిక స్థితిగతులు, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావం చేస్తాయన్నదాంట్లో సందేహమే లేదని పేర్కొంది. ఈ విషయమై అనిశా వాదన వాస్తవమని తెలిపింది. అనిశా పీపీ వాదనలు, బెయిల్ ఇచ్చే సందర్భంలో ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలనే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. లలిత ఇచ్చిన తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చింది. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అనిశా నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పితాని తనయుడు వెంకటసురేశ్ హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో న్యాయస్థానం పై విధంగా స్పందించింది.
ఇవీ చదవండి...