విజయవాడలో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ వృద్ధుని అదృశ్యం కలకలం రేపుతోంది. వన్ టౌన్లో నివసించే ఓ వృద్ధునికి ఆరోగ్యం సరిలేకపోవటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అతని భార్య. కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లమని ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది తెలిపారని ఆయన భార్య చెబుతున్నారు. అక్కడికి తీసుకెళ్లగా తన భర్త అదృశ్యమయ్యాడని వెల్లడించారు.
'నా భర్తను జూన్ 24న విజయవాడలోని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లా. చికిత్స చేస్తామంటూ ఆయనను ఆసుపత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. నన్ను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నా. ఆధార్ కార్డు తీసుకుని రేపు రమ్మని నాకు వైద్యులు చెప్పారు. నేను మర్నాడు మళ్లీ ఆసుపత్రికి వెళ్లాను. అయితే నా భర్త గురించి ఆరా తీయగా ఆ పేరుతో ఎవరూ ఆసుపత్రిలో లేరని వైద్యులు చెప్పారు' అని వృద్ధుని భార్య తెలిపారు.
దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తే వృద్ధున్ని వీల్ ఛైర్లో తీసుకెళ్తున్నట్లు కనపడింది. అయితే లోపలికి వెళ్లిన ఆయన ఏమయ్యాడో ఇంతవరకు ఆసుపత్రి వర్గాలు చెప్పలేకపోతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా సోకిందని తల్లిని రోడ్డుపై వదిలేసిన తనయుడు