జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల ద్వారా అన్ని గ్రామాల్లో పంటసాగు హక్కు పత్రాల పంపిణీపై అవగాహన సదస్సులు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి గ్రామాల వారీగా ప్రారంభించిన ఈ సదస్సుల్లో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సిబ్బందితోపాటు ఆయా గ్రామాల పరిధిలోని వివిధ బ్యాంకుల అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆయా సదస్సుల్లో అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి పంటసాగు హక్కు పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటారు. అలా పత్రాలకోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే సీసీఆర్‌సీ కార్డులు అందజేస్తారు. ఇలా దరఖాస్తుల స్వీకరణ, కార్డుల పంపిణీ సమాంతరంగా జరుగుతుంది. రోజుకు రెండు గ్రామాల చొప్పున సదస్సులు నిర్వహిస్తూ ఆగస్టు 7వ తేదీలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రత్యేక కమిటీల ఏర్పాటు
సదస్సుల నిర్వహణతోపాటు కౌలు రైతులందరికీ పత్రాలు పంపిణీ చేయడానికి జిల్లా మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌తోపాటు జేసీ, వ్యవసాయశాఖ జేడీ, ఉద్యానశాఖ జిల్లాస్థాయి అధికారులు కమిటీలో ఉంటారు. దీంతో మండలస్థాయిలో తహసీల్దారు, ఏవో, ఉద్యానశాఖ అధికారి, బ్యాంకు అధికారులు సభ్యులు ఉంటారు. గ్రామస్థాయిలో నిర్వహించే సదస్సుల్లో మండలస్థాయి అధికారులందరూ పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయి అధికారులు జిల్లా వ్యాప్తంగా జరిగే సదస్సులను పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తారు. ఇప్పటికే సాగు హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా అంతంత మాత్రంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 1.31లక్షలమంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూసినా ఇప్పటివరకు 13వేలకుపైగా మాత్రమే పత్రాలు అందజేశారు. పంటసాగు హక్కుపత్రాలు పొందాలంటే భూ యజమానుల అంగీకారం తప్పని సరి. ఇలాంటి తరుణంలో అధికారులు ఏమేరకు యజమానులను ఒప్పిస్తారో.. ఎంతమందికి పత్రాలు అందిస్తారో చూడాలి. కౌలు రైతు సంఘాల నాయకులు మాత్రం యజమానుల ప్రమేయం లేకుండా నేరుగా కౌలు రైతులందరికీ కార్డులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్‌సీ పత్రాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. బ్యాంకర్లతో సహా పలువురు మండలస్థాయి అధికారులు సదస్సుల్లో పాల్గొంటారు. రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. - మోహన్‌రావు, వ్యవసాయశాఖ జేడీ
రూ.1000కోట్ల రుణాలు
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కౌలు రైతులకు రూ.1000కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రుణాలు పొందాలంటే ప్రతి ఒక్కరూ పంట సాగు హక్కుపత్రం పొందాలి. దానికోసమే సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో బ్యాంకు అధికారులు పాల్గొంటారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే వారిని సంప్రదించి పరిష్కరించుకోవచ్ఛు
- రామ్మోహనరావు, ఎల్‌డీఎం
గతేడాది పంపిణీ చేసిన పంట సాగు హక్కుపత్రాలు | 15 వేలు |
ఈ ఏడాది ఇప్పటివరకు పంపిణీ చేసిన పత్రాలు | 13,533 |
గతేడాది కౌలురైతులకు పంపిణీ చేసిన రుణాలు | రూ.306కోట్లు |
జిల్లాలో ఉన్న కౌలురైతులు | 1.31 లక్షలు |
రైతుభరోసా కేంద్రాలు | 801 |
ఇదీ చదవండి :